కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణలకు 70:30 నిష్పత్తిలో జలాలను పంచాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చేవరకూ ఇదే నిష్పత్తిలో కొనసాగాలని పేర్కొంది. నాగార్జున సాగర్ ఎడమ విద్యుత్తు కేంద్రం, పులిచింతలలో ఉత్పత్తి చేసే విద్యుత్తులో తమకూ వాటా ఉందని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ జల వనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి లేఖ రాశారు. గత ఏడాది వరకూ 66:34 నిష్పత్తిలో వినియోగం జరగ్గా, ఈ ఏడాది 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ కోరింది. ఈ అంశాన్ని ఈ నెల 27న జరిగే బోర్డు సమావేశంలో ఎజెండాగా చేర్చారు. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై రాష్ట్రం రాసిన లేఖకు ప్రాధాన్యం ఏర్పడింది.
లేఖలోని ముఖ్యాంశాలివీ...
‘అవసరమైన అనుమతులు, రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేలకుండానే పలు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలతోపాటు గోదావరి నుంచి కృష్ణాలోకి నీటి మళ్లింపును తెలంగాణ చేపట్టింది. అనధికారికంగా విద్యుదుత్పత్తి చేస్తోంది. నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో కొత్తగా 5 ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటికి అదనంగా 37 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులున్నాయి. మొత్తం కొత్తగా 42 ప్రాజెక్టులను చేపట్టింది.
యాదాద్రి పవర్‌కు సాగర్ నుంచి 6.6 టీఎంసీల నీరు మళ్లించేలా పైప్‌లైను వేసింది. నెల్లికల్ ఎత్తిపోతల పరిధిని విస్తరించింది. పునర్విభజన చట్టం 11వ షెడ్యూలులో ఉన్నవి తప్ప, అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులను కట్టొద్దని 12వ బోర్డు సమావేశం పేర్కొంది. కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి వద్ద గత ఏడాది జనవరి 21న జరిగిన సమావేశంలోనూ, ఈ ఏడాది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టరాదని సూచించింది. చిన్న నీటి వనరులకు 89.15 టీఎంసీల కేటాయింపు ఉంటే 175 టీఎంసీలను వినియోగిస్తోంది. కృష్ణా బేసిన్‌లో 16,163 చెరువులను పునరుద్ధరించడంతోపాటు 386 కొత్త చెరువులు, చెక్‌డ్యాంలను నిర్మించారు. తెలంగాణకు ఉన్న 299 టీఎంసీలలో చిన్న నీటి వనరుల కింద వినియోగించుకునే 175 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 512 టీఎంసీలలో చిన్న నీటి వనరులకు ఉన్న 22.11 టీఎంసీలను మినహాయిస్తే, నీటి వాటా 80:20గా నిర్ణయించాలి. చిన్న నీటి వనరుల కింద తెలంగాణ 89.15 టీఎంసీలకు పరిమితం చేసుకుంటే 70:30 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి. 2021-22 నీటి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 70 శాతం, తెలంగాణకు 30శాతంగా పరిగణించాలి.’
మళ్లించే జలాలను లెక్కించండి
‘గోదావరి నుంచి తెలంగాణ 214 టీఎంసీలను కృష్ణా బేసిన్‌లోకి మళ్లిస్తోంది. ఇలా నీటిని మళ్లించే చోట టెలిమెట్రీ ఏర్పాటు చేసి ఎంత మళ్లిస్తున్నదీ నిర్ధారించాలి. జూన్ రెండు నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో తెలంగాణ అనధికారికంగా విద్యుదుత్పత్తి చేసింది. నీటి కేటాయింపు కోసం కృష్ణా బోర్డును వారు కోరలేదు. నీటి విడుదలకు బోర్డూ ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నీటిని తెలంగాణకు ఉన్న 299 టీఎంసీలలో భాగంగానే చూడాలి. నాగార్జున సాగర్ కుడి విద్యుత్తు కేంద్రం, టెయిల్‌పాండ్ విద్యుత్తు కేంద్రం రెండూ ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉన్నాయి కాబట్టి ఇవి మాకే చెందుతాయి. ఎడమవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ నీటి విడుదల ఉంది. కాబట్టి ఈ నీటి విడుదల నిష్పత్తిలో విద్యుత్తు పంపిణీ జరగాలి. పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రం తెలంగాణలోనే ఉన్నా, దిగువన ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌ది. ఈ అవసరాలకు తగ్గట్లుగా నీరు విడుదల చేయాలి కాబట్టి విద్యుదుత్పత్తిలో వాటా పంపిణీ జరగాలి’ అని బోర్డుకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ పేర్కొంది.
ఇదీ చదవండి: cm jagan on Fake Challan Scam: 'ఎన్నాళ్ల నుంచీ నకిలీ మకిలి?'