పట్టణ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పన్నులు పెంపు చట్టంలో ప్రతి సంవత్సరం ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు అంశం నిజమా కాదా అనే దానిపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌరసమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఆదుకోల్సిన ప్రభుత్వం ప్రజలకు ప్యాకేజీలు ఇవ్వాల్సింది పోయి పన్నులు పెంచడమేంటని ప్రశ్నించారు. ప్రపంచమంతా ప్రజలకు నగదు బదిలీ చేస్తూ కరోనా నుంచి ఉపశమనం కలిగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో పన్నులు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్నారన్నారు. చెత్తపై, డ్రైనేజ్లపై పన్నులు వేయడం కొత్తగా చూస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 196,197,198 లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. లేదంటే జనవరి 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థల కార్యాలయాల ముందు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని అన్నారు.
ఇదీ చదవండి: గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం!