ఆపరేషన్ ముస్కాన్ పేరుతో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు.. పోలీసులు, బాలల సంక్షేమశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్తంగా తనిఖీలు చేశారు. వేకువజామున నాలుగు గంటల నుంచే రైల్వే, బస్ స్టేషన్లు, సినిమా హాళ్లు, పార్కులు, తదితర ప్రాంతాల్లో 794 బృందాలతో తనిఖీలు నిర్వహించారు. 2 వేల 774 మంది బాలకార్మికులను గుర్తించారు. వారిలో 2 వేల 378 మంది బాలురు, 396 మంది బాలికలున్నారు. వీరిలో కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నారని, వారికి కౌన్సిలింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. బాలకార్మికుల్లో కొందరిని ప్రభుత్వ వసతి గృహాలకు తరలించామని, మరికొందరిని పాఠశాలల్లో చేర్చామని పేర్కొన్నారు.
యాచక వృత్తిలోనే చాలా మంది
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చాలా మంది చిన్నారులు యాచక వృత్తుల్లోనూ ఉంటున్నారని, కనీసం ఐదేళ్లు నిండనివారూ బాధితుల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అటువంటి వారిని అంగన్‌వాడీల్లో చేర్చినట్లు వివరించారు. పిల్లలను పనుల్లో పెట్టుకున్న వారిపై బాల కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలువురు యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బుధవారమూ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. బాలకార్మికులు ఉన్నట్లు గుర్తిస్తే సమాచారమివ్వాలని పోలీసులు, బాలల సంక్షేమశాఖ అధికారులు ప్రజల్ని కోరారు.
ఇదీ చూడండి: