High Court on MNRGS Pending Bills: ఉపాధి హామీ పనులు చేపట్టిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంపై విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారులను హైకోర్టు నిలదీసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా జరిపిన బకాయిల చెల్లింపు వివరాల్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. బకాయిలు రాకపోవడంతో కర్నూలు జిల్లాలో ఓ గుత్తేదారు ఆత్మహత్య చేసుకున్న వ్యవహారాన్ని గుర్తుచేసింది. ఆ కుటుంబానికి ఆసరా ఎవరిస్తారని అధికారులకు ప్రశ్నలు సంధించింది. అప్పుతెచ్చి పనులు చేపట్టిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని నిలదీసింది. ప్రభుత్వ వ్యవహార శైలి ఇలా ఉంటే పనులు చేసేందుకు ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించింది.
ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కె. శశిధర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. ఎస్ రావత్.. కోర్టుకు హాజరయ్యారు. బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయడం లేదని అధికారులను ప్రశ్నించింది. తమ ఉత్తర్వులను అమలుచేయకపోవడంతో అన్ని కేసుల్లో కోర్టుదిక్కరణ వ్యాజ్యాలు నమోదు అవుతున్నాయని గుర్తుచేసింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ.. కృష్ణా జిల్లాకు చెందిన వీరమాచినేని రామకృష్ణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. గత ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారులు కోర్టుకు హాజరయ్యారు.
ఇవీ చూడండి