ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహా సభల్లో ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేయడాన్ని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పబట్టారు. తెదేపా నేతలకే తెలుగు మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వచ్చే సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే తెలుగును బహిష్కరించినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వైకాపా ప్రభుత్వం తెలుగు భాషకు వ్యతిరేకం కాదన్న ఆయన... పేద పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. తెలుగు భాష వేదికను రాజకీయ వేదికగా మార్చొద్దని హితవు పలికారు.
మీడియాపై దాడికి తెదేపా సమాధానం చెప్పాలి
తెలుగు భాష రచయితల సమావేశానికి గొప్పగొప్ప మేధావులు వస్తున్నారన్న అంబటి... జగన్మోహన్ రెడ్డికి తన తల్లి ఎంత ఇష్టమో తెలుగు భాష కూడా అంతే ఇష్టమని స్పష్టం చేశారు. తెలుగు భాష వేరు, తెలుగు మీడియం వేరని వివరించారు. రాజధాని అంశంపై నిరసనల్లో మీడియా మీద దాడిని వైకాపా తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. మీడియాపై దాడి చేసింది రైతులు కాదన్నారు. రైతుల ముసుగులో బయటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న తెదేపా నేతలు మీడియాపై దాడికి సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయాలి'