రాష్ట్ర ప్రభుత్వ నూతన పన్ను పెంపు విధానాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్లో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. సమావేశంలో వామపక్ష నేతలు రామకృష్ణ, మధు, కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పలువురు నేతలు పాల్గొన్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త పన్నుల జీవోలను ఉపసంహరించుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమం చేయాలని సమావేశంలో తీర్మానం చేసారు.
ప్రభుత్వ నూతన పన్ను విధానం ప్రజలకు పిడుగుపాటుగా మారిందని..కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం పన్నులు పెంచడం మూర్ఖపు చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులంటే.. భాజపా ఒకే రాజధాని అంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. అమరావతిపై భాజపాకి చిత్తశుద్ధి ఉంటే..కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు. పన్నుల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని మండిపడ్డారు.
తెదేపా హయాంలో పన్నులు పెంచకపోయినా అసత్య ప్రచారం చేసిన జగన్..అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. కరోనా సమయంలో కూడా నిత్యావసర ధరలు రెట్టింపు చేశారని.. పన్నులు వేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ప్రణాళికలు లేకుండా పక్కవారిపై ఆధారపడి పాలన చేస్తున్నారని కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ అన్నారు. ఇష్టానుసారంగా ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆక్షేపించారు.
ఇదీచదవండి
Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..!