నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు సమన్వయ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. రైతులపై అన్యాయంగా క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రైతులకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లాలో..
దిల్లిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లాలోని పెదనందిపాడు, నాగులపాడు, వరగాని గ్రామాలలో వందలాది రైతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతులో పెట్టేలా ఉన్నాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో...
సీపీఐ రైతు సంఘం ఆధ్వర్యంలో శింగనమల మండలము సలకంచెరువు స్టేట్ బ్యాంక్ వద్ద మహిళా రైతులతో కలిసి మానవహరం నిర్వహించారు. కేంద్రం.. రైతులను చర్చల పేరుతో మోసం చేస్తుందని ఆరోపించారు. వైకాపా, తెదేపా రైతులకు మద్దతుగా నిలవాలన్నారు. కేంద్రం మొండివైఖరి వీడి నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో...
అన్నదాత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు, మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రైతన్నల శ్రమను కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: