కుప్పంలోని సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ వార్డులన్నింటికీ అదనపు భద్రతా బలగాలను మోహరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఎన్నికల సంఘానికి చెందిన ఐఏఎస్ అధికారి కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. తెదేపా అభ్యర్థులు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అధికారి స్పందిస్తూ.. ఈ చర్యలు చేపట్టారు.
గ్రామ/వార్డు వాలంటీర్లను వినియోగించుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెదేపా అభ్యర్థులు ఫిర్యాదులో తెలిపారని ఎన్నికల సంఘం అధికారి పేర్కొన్నారు. తెదేపా అభ్యర్థులు చేసిన ఫిర్యాదు కాపీలను.. తన ఆదేశాలకు ఎన్నికల అధికారి జత చేశారు. పెద్ద ఎత్తున బోగస్, ఫేక్ ఓట్లు వేసుకునేందుకు అధికార వైకాపా నేతలు బయటి వ్యక్తులను సమీకరిస్తున్నారన్న విషయాన్ని ఉన్నతాధికారి అందులో పేర్కొన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కుప్పం మున్సిపాలిటీలోని అన్ని పోలింగ్ కేంద్రాలను క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్‌గా పరిగణించాలని కోరారు. పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైవ్ వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ రికార్డింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు పోలీసులతో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలన్నారు. పై విషయాల్లో అవసరమైన చర్యలు తీసుకుని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి వాటి నివేదిక పంపాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: Municipal Elections: ఆ ఎన్నికల్లో వైకాపా ఓడితే జగన్ సీఎం పదవి పోతుందా ?: అమర్నాథ్ రెడ్డి