Suicides in Vijayawada: చుట్టుముడుతున్న మానసిక ఒత్తిళ్లు.. కుటుంబ, అనారోగ్య సమస్యలు.. ఇవి చాలవన్నట్లు ఆర్థిక ఇబ్బందులు.. కెరీర్‌లో ఎత్తుపల్లాలు.. మరికొందరికి వివాహేతర సంబంధాలు.. ఇలా వివిధ కారణాలతో తనువు చాలించే వారి సంఖ్య పెరుగుతోంది. సమస్యలను ఎదుర్కోలేక నిస్పృహకు గురై కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలికి... కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. విజయవాడ నగరంలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక సంస్థ ఇటీవల విడుదల చేసిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
2021 సంవత్సరానికి సంబంధించి ఎన్‌సీఆర్బీ గణాంకాల ప్రకారం విజయవాడ నగరంలో మొత్తం 385 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో పురుషులు 304 మంది, మహిళలు 81 మంది ఉన్నారు. 2020లో 324 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 18.8 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం కేసుల్లో కుటుంబపరమైన ఇబ్బందులతో ప్రాణం తీసుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 140 మంది ఈ కారణంతో ఆత్మహత్యకు పాల్పడగా... పురుషులే అధికం. కుటుంబ సమస్యలు దీర్ఘకాలం పాటు పరిష్కారం కాక... విసిగిపోయి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులతోనూ ఎక్కువ మంది ప్రాణం తీసుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా నగరంలో గత ఏడాది 119 మంది తనువు చాలించారు. ఎంతకీ వ్యాధి నయం కాకపోవడంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య ఇబ్బందులు తాళలేక మరో 89 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలూ ఉసురు తీస్తున్నాయి. వ్యాపారాలు దివాలా , అప్పులు భరించలేక.. తిరిగి రుణాలు చెలించే దారి కనిపించక... మరణించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. గత ఏడాది 57 మంది ప్రాణం తీసుకున్నారు.
మానసిక రుగ్మతలతో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారాల కారణంగా 19 మంది యువత బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో 12 మంది యువకులు, ఏడుగురు యువతులు ఉన్నారు. ప్రేమ విఫలం, పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరణ వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. పేదరికం కారణంగా ఐదుగురు, కారణాలు తెలియనివి 14 కేసులు నమోదు అయ్యాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక 8 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాదక ద్రవ్యాలు, మద్యానికి బానిసై ముగ్గురు, ఇతర కారణాలతో 64 మంది ప్రాణం తీసుకున్నారు.
ఇవీ చదవండి: