సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కులతో రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు యత్నించిన కేసులో తీగ లాగుతుంటే అనేక డొంకలు కదులుతున్నాయి. ఈ ముఠా డబ్బు పొందడంలో సఫలం కాకపోయినా.. అదే తరహాలో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే కొందరు రూ.లక్షల్లో సొమ్ము కాజేశారు. ఇవి తక్కువ మొత్తాలు కావటంతో ఇప్పటివరకూ బయటపడలేదు. అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు తాజా కేసును విచారిస్తుండటంతో ఇప్పటికే జరిగిన మోసాలు వెల్లడవుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇలా అక్రమంగా కాజేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దీనిపై ప్రొద్దుటూరులో బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం మూడు కేసులు నమోదయ్యాయి. అక్కడ రూ.9.95 లక్షలను నకిలీ చెక్కులతో కాజేసినట్లు తేలింది. తమిళనాడులోని వసూర్‌లో ఈ నకిలీ చెక్కులు తయారైనట్లు బయటపడింది. తాజాగా గురువారం కృష్ణాజిల్లా కొండపల్లిలోనూ కొందరిని అనిశా అధికారులు విచారించారు. విస్సన్నపేటలో బ్యాంకు అధికారులతో మాట్లాడి అసలైన చెక్కుల్ని ఎప్పుడు నగదుగా మార్చుకున్నారనే అంశాలపై వివరాలు సేకరించారు. అవే నెంబర్లు నకిలీ చెక్కుల ముఠాకు ఎలా చేరాయనే అంశంపై దృష్టిసారించారు.
- ఒక్క ముఠానా.. వేర్వేరువా?
రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నం ఒకే ముఠా పనేనా? లేదా వేర్వేరు ముఠాలున్నాయా? అనే అంశాలపై అనిశా, సీఐడీ బృందాలు ఆరా తీస్తున్నాయి. వేర్వేరు తేదీల్లో వేర్వేరు నగరాల్లో నకిలీ చెక్కుల మార్పిడికి ప్రయత్నించడంతో.. ఒకే వ్యక్తి వెళ్లారా.. లేదా ఆయా ప్రాంతాల్లోని తన మనుషులను పంపారా? అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారులు ఆ బ్యాంకు శాఖల్లోని సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. నకిలీ చెక్కులను తెచ్చినవారిని గుర్తించే పనిలో ఉన్నారు.
- చెక్కు నంబర్లు ఎలా చేరాయి?
సీఎంఆర్‌ఎఫ్ నుంచి జారీ అయ్యే చెక్కులపై ఉన్న నంబర్లు ముఠాలకు ఎలా చేరుతున్నాయి? వాటిని చేరవేయటంలో ఎవరి పాత్ర ఉంటోంది? వాటి ఆధారంగా నకిలీ చెక్కులు ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. లబ్ధిదారులా.. సచివాలయ ఉద్యోగులా.. ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసేవారా.. వీరిలో ఎవరు ఆ నంబర్లు చేరవేస్తున్నారో ఆరా తీస్తున్నారు. అసలైన చెక్కులు ఎవరి పేరిట జారీ అయ్యాయో వారినీ విచారించారు. కొంతమంది ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి స్నేహితులు, కుటుంబసభ్యుల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
సీఎం సహాయ నిధి నకిలీ చెక్కుల కేసులో.. లొంగిపోయిన ప్రధాన నిందితుడు
ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల కేసులో ప్రధాన నిందితుడు భాస్కర్‌రెడ్డి గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం ఆర్‌ఎఫ్ నకిలీ చెక్కుల మార్పిడి వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలేపాడుకు చెందిన వినయ్‌కుమార్ రూ.3.60 లక్షలు, ప్రొద్దుటూరు మండలం కల్లూరుకు చెందిన శ్రీకాంత్ రూ.3.40 లక్షలు, వైఎంఆర్‌కాలనీకి చెందిన మహ్మద్ రహిమాన్ రూ.2.95 లక్షలకు నకిలీ చెక్కులు సమర్పించి డబ్బులు డ్రా చేసినట్లు బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. ప్రధాన నిందితుడు చాపాడు మండలం వెంగన్నగారిపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి ప్రొద్దుటూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. ఇతను ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏవోగా పని చేస్తున్నాడు. భాస్కర్‌రెడ్డి మీడియాకు తెలిపిన ప్రకారం... ‘నా స్నేహితుడు తమిళనాడు రాష్ట్రం హోసూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతని సలహా మేరకు డబ్బుకు ఆశపడి నకిలీ చెక్కుల ద్వారా నగదు డ్రా చేశా. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి వద్ద మూడు పాత చెక్కులు తీసుకుని వాటిని హోసూర్‌లోని స్నేహితుడికి పంపించా. అతను అందులో ఉన్న వివరాలను మార్చి మూడు చెక్కుల్లో ఉన్న రూ.25 వేల మొత్తాన్ని రూ.9.95 లక్షలుగా మార్చి నాకు పంపాడు. ఆ చెక్కులను ముగ్గురు స్నేహితుల ఖాతాల్లో జమచేసి నగదు తీసుకున్నా’ అని వివరించాడు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సీఎంఆర్‌ఎఫ్ కుంభకోణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు.. లొంగిపోయిన నిందితుడు