కరోనా.. ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ మహమ్మారి వైరస్‌ను కట్టడి చేయలేక అభివృద్ధి చెందిన దేశాలు సైతం చేతులేత్తేస్తున్నాయి. అయితే సాంకేతిక సాయంతో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అంటున్నారు విజయవాడకు చెందిన చైతన్య అనే యువకుడు. కరోనా నియంత్రణకు ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రజలు, ప్రభుత్వాలు వినియోగించుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సాఫ్ట్‌వేర్ ప్రయోజనాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. కరోనా సోకిన వారి గుర్తింపు, కట్టడి, నియంత్రణ ఇతర అదనపు సేవల కోసం వినియోగిస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
ఏయే ప్రాంతంలో ఎంతమంది కరోనా బాధితులు ఉన్నారన్నది.. ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఎవరైనా తెలుసుకునే వెసులుబాటు ఉంది. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం వివరాలను నమోదు చేయవచ్చు. అలాగే కరోనా సోకిన వారు సైతం.. స్వతహాగా తమ వివరాలను ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉంది. కరోనా బాధితుల వ్యక్తిగత గోప్యతకు.. ఈ సాఫ్ట్‌వేర్ తో ఎలాంటి భంగం వాటిల్లదు. అలాగే.. తమ పరిసర ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, రెడ్‌జోన్ ప్రాంతాలు ఉన్నాయో ప్రజలు తెలుసుకోవచ్చు. వైరస్ బాధితులు ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా.. ఆ వైపు సంచరించకుండా.. సామాజిక దూరం పాటించడానికిీ ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వాలు సైతం ఏ ప్రాంతంలో కరోనా విజృంభిస్తుందో గుర్తించి సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడుతుంది.
ఎబోలా సమయంలో రూపకల్పన
2015వ సంవత్సరంలో ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా అతలాకుతలం చేసింది. ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు 50శాతం పైగా మరణాలు సంభవించాయి. అయితే అదృష్టవశాత్తు ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేయగలిగారు. ఆ సమయంలో తాను పనిచేస్తున్న ఓ ఐటీ సంస్థ ద్వారా విజయవాడకు చెందిన చైతన్య... "ఉషహిది" అనే ఉచిత సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఎబోలాను కట్టడి చేసేందుకు ఉపయోగపడేలా అందుబాటులోకి తెచ్చారు. తాజాగా.. ఆ సాఫ్ట్వేర్కో మరింత మెరుగులు దిద్ది కరోనా నియంత్రణకు ఉపయోగిస్తున్నారు. కరోనా కట్టడికి వివిధ స్థాయిల్లో వైద్యులు, ప్రభుత్వాలు, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా, పోలీసులు ఇలా వివిధ రంగాల వారు పడుతున్న కష్టం చూసి సమాజానికి తనవంతు సాయంగా దీనిని ప్రతిపాదించినట్లు చైతన్య చెప్పారు.
ఇదీ చదవండి: