హనుమంతుని జన్మస్థానం సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతంగా నిరూపించేందుకు ఈనెల 21న శ్రీరామనవమి పర్వదినాన తితిదే సిద్ధమవుతోంది. ఉగాది రోజున శాస్త్రీయ ఆధారాలతో నిరూపించనున్నట్లు తితిదే ఇటీవల ప్రకటించింది. కానీ ఆంజనేయస్వామి శ్రీరాముడి ప్రియ భక్తుడైనందున శ్రీరామనవమి రోజున ఆయన జన్మ వృత్తాంతాన్ని వెల్లడించాలని తాజాగా నిర్ణయించింది. ఆ రోజున పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో తితిదే నిరూపించనుంది. అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ధ్రువీకరించే సాక్ష్యాల గురించి సమగ్రంగా అధ్యయనం చేయడానికి తితిదే ఈవో జవహర్‌రెడ్డి గత ఏడాది డిసెంబరులో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
తిరుమలకు ప్లాస్టిక్ సీసాలు తీసుకురావొద్దు
తిరుమలలో పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు సహకరించాలని తితిదే ఆరోగ్యవిభాగాధికారి ఆర్.ఆర్.రెడ్డి కోరారు. ప్లాస్టిక్ సీసాలు తిరుమలకు తీసుకురావొద్దని భక్తులకు సూచించారు. తిరుమలకు వచ్చే యాత్రికులు, ఉద్యోగులు, స్థానికులు, వ్యాపార సంస్థలకు సోమవారం ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. పునర్వినియోగ సీసాలను తీసుకురావొచ్చని సూచించారు.
ఇదీ చదవండి:
నూతన సంవత్సరాదికి శ్రీవారి సన్నిధి ముస్తాబు.. నేడు ఉగాది ఆస్థానం