సాధారణ పరిస్థితుల్లో రోజుకు 60-70వేల మంది తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేషదినాల్లో ఈ సంఖ్య లక్ష మించుతుంది. ఈ స్థాయిలో భక్తులు తిరుగిరులకు తరలివస్తున్న తరుణంలో తితిదేకి వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యగా మారుతోంది. శ్రీవారి ప్రసాదాల కవర్ల దగ్గర నుంచి దాహం తీర్చుకునేందుకు వెంట తెచ్చుకునే మంచినీటి సీసాల వరకూ అన్నీ వ్యర్థాల రూపంలో కొండపై కుప్పగా పేరుకుపోతున్నాయి. భోజన సత్రాలు, వసతి సముదాయాలు, హోటళ్లు, కార్యాలయాలు, నివాస గృహాలు ఒకటేమిటి రోజుకు 30 టన్నులకు పైగా వ్యర్థాలు తిరుమలలో పోగవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు 24 గంటలూ శ్రమిస్తూ.. ఈ చెత్తనంతా కాకులకొండ ప్రాంతంలోని ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలిస్తూ ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.
తిరుగిరులపై పేరుకుపోతున్న ఈ చెత్త గుట్టలను తగ్గించేందుకు తితిదే కాకులకొండ డంపింగ్ యార్డ్‌లో సేంద్రీయ ఎరువుల తయారీ యూనిట్‌ను చానాళ్ల క్రితమే ప్రారంభించింది. బెంగుళూరుకు చెందిన బ్రైట్ వేస్ట్ టెక్నాలజీ ఈ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఏడాదికి 1500 టన్నుల సేంద్రీయ ఎరువుల ఉత్పత్తే ధ్యేయంగా ఈ సంస్థ కృషి చేస్తోంది. అందుకుగానూ తితిదే ఈ సంస్థకి రూ. 73లక్షల నుంచి రూ.89లక్షల వరకు చెల్లిస్తోంది. కానీ తయారు చేసిన ఎరువును విక్రయించేందుకు తితిదేకి లైసెన్స్ లేకపోవటంతో తయారు చేసిన ఎరువు సైతం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అలా ఆ మొత్తం తయారు చేసిన ఎరువు ఇప్పటికి 6వేల టన్నులకు చేరుకుంది. ఈ తరుణంలో ఎరువు తయారీ, వ్యర్థాల నిర్వహణ భారంగా మారుతుండటంతో తితిదే గత పాలకమండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. తయారు చేసిన ఎరువులను విక్రయించాలనే ఉద్దేశంతో లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. బుధవారం తితిదేకు ఇందుకు సంబంధించి అనుమతులు లభించాయి.
కొండపై నుంచి కిందకి తరలించేందుకు, విక్రయానికి అనుమతులు లభించటంతో తితిదే త్వరలోనే ఈ ఎరువుల విక్రయం కోసం వేలాన్ని నిర్వహించనున్నట్లు ఈవో కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి ఘన వ్యర్థాల నిర్వహణా కేంద్రాన్ని పరిశీలించిన ఆయన.. గతంలో నిర్వహణ భారమై మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమ సంస్థ ఘన వ్యర్థాల ప్రాసెస్‌ను నిలిపివేసిన వైనాన్ని తెలుసుకున్నారు. పాడైపోయిన ఆ పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రం ఏర్పాటుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపున కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని పాలకమండలి సభ్యురాలు సుధా నారాయణ మూర్తి హామీ ఇవ్వటంతో ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈవో అధికారులకు సూచించారు. మరో వైపు భూమిలో కుళ్లని వ్యర్థాలను ప్యాక్ చేసి కొండ కిందికి తరలించే విధంగా నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు.
తిరుగిరులు తిరిగి స్వచ్ఛతాశోభను సంతరించుకోనున్నాయి
పవిత్ర పుణ్యధామంలో ఇన్నాళ్లు పేరుకుపోయిన చెత్తగుట్టలు ఎరువులుగా మారి ఇక రైతులకు అందుబాటులోకి వెళ్లనున్నాయి. వేలం ప్రక్రియను వేగవంతం చేయటం ద్వారా తితిదే ఆధ్వర్యంలో తయారైన ఈ సేంద్రీయ ఎరువులు రైతుల పొలాలకు దన్నుగా మారటంతో పాటు... పచ్చని తిరుగిరులు తిరిగి స్వచ్ఛతాశోభను సంతరించుకోనున్నాయి.
- డా.కేఎస్ జవహర్ రెడ్డి, తితిదే ఈవో
ఇదీ చదవండి: