మారుమూల ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి ఉద్దేశించిన శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు భారీగా తెచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. మే 25న ట్రస్టు ప్రారంభమవగా తొలినాళ్లలో భక్తుల నుంచి స్పందన కరవైంది. అనంతరం ఎక్కువ మంది దాతలను ఆకర్షించేలా 10వేల రూపాయలు ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్ పొందే అవకాశాన్ని తితిదే కల్పించింది. 10 వేలతో పాటు 500 రూపాయలు చెల్లించి టిక్కెట్టు పొందినవారికి వీఐపీ దర్శన సమయంలో ప్రొటోకాల్ పరిధిలో శ్రీవారి దర్శనం కల్పిస్తోంది.
ఆన్‌లైన్... ఆఫ్లైన్లలో
శ్రీవాణి ట్రస్టును మరింత బలోపేతం చేసేలా విరాళాలిచ్చే వారికోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. దాతలు ఆన్‌లైన్‌లోనే విరాళాలు అందించి బ్రేక్ దర్శనం టిక్కెట్టు పొందవచ్చు. డిసెంబరు 31వ తేదీ వరకు ఆన్‌లైన్ టిక్కెట్ల కోటాను పోర్టల్‌లో తితిదే విడుదల చేసింది. శుక్రవారం రోజున 200 బ్రేక్ దర్శన టికెట్లు, మిగతా రోజుల్లో 500 బ్రేక్ దర్శన టికెట్లు చొప్పున శ్రీవాణి ట్రస్టుకు కేటాయించారు. విరాళం సమర్పించిన రోజు నుంచి 6 నెలల్లో స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. పోర్టల్ ప్రారంభించిన తొలి రోజే ఏడుగురు దాతలు ఆన్‌లైన్‌లో విరాళం పంపి, దర్శనం స్లాట్ తీసుకున్నట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
అక్టోబర్ 21 నుంచి1,109 మంది భక్తులు కోటి 10 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు. హారతి, తీర్థ, శఠారీలతో కూడిన దర్శనం లభిస్తున్నందున దీనికి విశేష ఆదరణ లభిస్తోంది.
ఇదీ చదవండి: