డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే కొనసాగించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలను ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వివరించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఆస్తుల వివరాలు వెల్లడిస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్న సుబ్బారెడ్డి... కేంద్ర, రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి దృష్ట్యా ఉత్తరద్వారం 10 రోజులు తెరిచి ఉంచుతామని సుబ్బారెడ్డి వివరించారు. కమిటీ ఏర్పాటు చేసి, పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. డిసెంబరు 5 నుంచి పదిరోజులపాటు వైకుంఠద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేస్తామన్న సుబ్బారెడ్డి... నడకదారిలోని గోపురాలకు మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
తిరుమలకు 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్టు సుబ్బారెడ్డి వివరించారు. సౌర, పవనశక్తి వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్న తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి... తిరుచానూరు ఆలయంలోని సూర్యప్రభ వాహనానికి బంగారు తాపడం చేస్తామన్నారు. హిందూ సనాతన ధర్మ రక్షణకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తిరుమలలో కాటేజీలకు మరమ్మతులు చేస్తున్నామన్న సుబ్బారెడ్డి... జిల్లా కేంద్రాల్లో స్వామివారి కల్యాణం, పేదలకు పెళ్లిళ్లు నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ... తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా