తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో.. 2,937 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. గతేడాది అంచనాలతో పోలిస్తే దాదాపు 400 కోట్ల రూపాయల మేర ఈ ఏడాది తగ్గింది. కరోనా కారణంగా మార్చి 20 నుంచి.. 80 రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతించకపోవడం.. తదనంతర కాలంలో పరిమిత సంఖ్యలో యాత్రికులను దర్శనానికి అనుమతిస్తుండడంతో తితిదే ఆదాయం భారీగా తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,131 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వస్తుందని అంచనా వేసిన తితిదే.. వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీల ద్వారా రూ.533 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.375 కోట్లు, శ్రీవారి దర్శన టికెట్ల ద్వారా రూ.210 కోట్లు, వసతి గృహాలు, కల్యాణ మండపాల అద్దె ద్వారా రూ.93 కోట్లు, తలనీలాల విక్రయాల ద్వారా 131కోట్ల రూపాయలు ఆదాయం రావచ్చని అంచనా వేసింది.
యాత్రికుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం
యాత్రికుల వసతి సౌకర్యాల కల్పనకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చిన పాలకమండలి.. ఇంజినీరింగ్ పనులకు 300 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆసుపత్రులలో.. మౌలిక వసతుల కల్పనకు 141 కోట్ల రూపాయలు కేటాయించింది. తితిదే ఆధ్వర్యంలోని విద్యాసంస్థలకు 153 కోట్ల రూపాయలను కేటాయించిన ధర్మకర్తల మండలి.. ఆరోగ్యం, పరిశుభ్రతకు 170కోట్ల రూపాయలను కేటాయించింది.
100 అంశాలపై చర్చ
బోర్డు సమావేశంలో అజెండాలోని సుమారు 100 అంశాలపై చర్చించిన పాలకమండలి సభ్యులు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 20 నుంచి తిరుమల ఆలయంలో నిలిపి వేసిన ఆర్జిత సేవలను దాదాపు ఏడాది తర్వాత తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి తిరిగి ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్లు ఛైర్మన్ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం సేవను ప్రారంభించనున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి
బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో ఏర్పాటు చేయనున్న చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధి కోసం తొమ్మిది కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. తిరుమలలో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్దీకరించనున్నామని.. వసతి గృహాలు, అతిథి గృహాల్లో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. గో సంరక్షణలో భాగంగా తితిదే ఇప్పటికే పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని.. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేస్తున్నామన్నారు. శ్రీవారి మెట్ల కాలినడక మార్గంలో అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు.
గరుడ వారధి నిర్మాణంలో ప్రాజెక్ట్ డిజైన్స్ పై.. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నుంచి స్పష్టత కోరిన పాలకమండలి.. బడ్జెట్లో 50 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్యకు సహస్ర కలశాభిషేకం