కోర్కెలు తీర్చే కోనేటిరాయుడి వార్షిక తెప్పోత్సవాలు గురువారం నుంచి ఐదు రోజుల పాటు తిరుమలలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి పర్వదినాన తెప్పోత్సవాలను ప్రారంభించి... పౌర్ణమి రోజున ముగిసేలా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో యుగానికి ఒక్కో అవతారాన్ని గుర్తుచేస్తూ... ఈ వేడుకలు నేత్రపర్వంగా సాగనున్నాయి. తొలి రోజున త్రేతాయుగానికి చెందిన సీతారామలక్ష్మణులు, రెండో రోజున ద్వాపర యుగానికి చెందిన రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, తర్వాతి మూడురోజులు కలియుగనాథుడైన శ్రీవారు... దేవేరులతో కలసి తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు.
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించేందుకు పుష్కరిణిని సుందరీకరించారు. కోనేటిలో నీటిపై తెప్పను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. పుష్కరిణి వద్ద దేవతామూర్తుల ప్రతిరూపాలు ఏర్పాటు చేశారు. తెప్పోత్సవాలు జరిగే మెదటి రెండు రోజులు వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు. చివరి మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవను రద్దు చేశారు. ఉత్సవాలలో పాల్గొన దలచిన భక్తులు సీఆర్వో వద్ద ఉన్న ఆర్జిత సేవా కేంద్రంలో రూ. 500 చెల్లించి టిక్కెట్లను పొందవచ్చు. టిక్కెట్లు పొందిన భక్తులకు తెప్పోత్సవంలో పాల్గొనే అవకాశమే కాక.. శ్రీవారి దర్శన వసతి లభిస్తుంది.
ఇదీ చూడండి: