తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది భక్తజన సందోహం మధ్య అంగరంగవైభవంగా నిర్వహించేవారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితమవుతున్నాయి. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని తితిదే పాలకమండలి నిర్ణయించడంతో.. అందుకు అనుగుణంగా ఆలయంతో పాటు పరిశరాలను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయ గొపురాలకు రంగులు అద్దడం, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో రంగవళ్లులతో అందంగా ముస్తాబుచేస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు రోజుకు రెండు వాహన సేవసపై స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహిచనుండడంతో వాహన సేవలు ఆలయానికే పరిమితం కానున్నాయి. 18వ తేదిన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 19న ద్వజారోహనంతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. వాహన సేవలు ఉదయం వాహన 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించారు.
ప్రతి ఏడాది ఉత్సవాలలో వినియోగించే వాహనాలను కల్యాణమండపంలో ఉంచి శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్పస్వామివారిని వేంచేపుచేసి.. యథావిదిగా వజ్రవైడూర్యాలు, పరిమళభరిత పూలమాలలు అలంకరించి భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రథోత్సవం, స్వర్ణరథంను ఆలయం ఆలయంకు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో వాటిస్థానంలో సర్వభూపాల వాహన సేవలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి వైధిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజున శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానంను ఆలయంలోనే నిర్వహించనున్నారు.
వెండి గంగాళంలో పవిత్రజలాలను నింపి చక్రతాళ్వారుకు చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించే పట్టు వస్త్రాలను 23వ తేదీన గరుడవాహన సేవ సమయంలో ముఖ్యమంత్రి జగన్ సమర్పించనున్నారు. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. తొలుత జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్న తితిదే.. అక్టోబర్ 16 నుంచి నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలను కరోనా ప్రభావం తగ్గితే భక్తులను అనుమతించి తిరుమాడ వీధుల్లో నిర్వహించాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: వచ్చే విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం: సీఎం