వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో... భక్తుల
సౌకర్యార్థం ఏర్పాట్ల పై... అదనపు ఈవో ధర్మారెడ్డి తితిదేలోని అన్ని విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో చెప్పులు లేకుండా నడిచే వారికోసం .. తిరుమాడవీధుల్లో కూల్ పెయింట్ వేయాలని నిర్ణయించారు. ఎండల నుంచి ఉపశమనం కల్పించేలా రద్దీ ప్రదేశాలలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. సెలవుల్లో ఎక్కువ మంది వచ్చి స్వామివారికి తలనీలాలను సమర్పిచే అవకాశం ఉండడంతో క్షురకులకు సెలవులను రద్దు చేసినట్లు ప్రకటించారు.
శేషాచల అడవుల్లో ప్రతి సంవత్సరం వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించి అరుదైన జీవరాశులు, అటవీ సంపద బూడిదవుతుంది. వాటి నివారణకు.. ఈ ఏడాది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని తితిదే స్పష్టం చేసింది. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం కారణంగా... భక్తులు నీటిని పట్టుకునేందుకు ప్లాస్టిక్ రహిత బాటిల్స్నే వినియోగించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై తితిదే ప్రత్యేక దృష్టి సారించింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి రోగ నివారణ మందులతో శుభ్రం చేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు.
కరోనా ప్రభావంతో తిరుమల యాత్రను వాయిదా వేసుకునే భక్తులకు ప్రత్యేక దర్శన ఆన్ లైన్ టికెట్ల రద్దు లేదా తేదీలో మార్పు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తితిదే స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :నువ్వలరేవు.. అంతా నవ్వుతూ.. ఒకే మాట ఒకే బాట!