పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి .. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషాతో కలిసి తిరుపతిలో పర్యటించారు. తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న ప్రకాశం మున్సిపల్ పార్కు, తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు.
ఉద్యానవనంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీలక్ష్మీకి వివరించారు. చిన్నారులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాలను, పార్క్లో ఏర్పాటు చేస్తున్న పచ్చిక బయళ్లను పరిశీలించారు. ఉద్యానవనాలు నగరవాసులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం రేణిగుంట రోడ్డు వద్ద నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ, సౌర విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు.
నాలుగు సంవత్సరాల నుంచి నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఆకర్షణీయ నగర పథకం నిధులతో బయో టెస్ట్ యంత్రం అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. నగరంలో సేకరించిన వ్యర్థాలను తడి, పొడి చెత్తలుగా వేరు చేసి బయోగ్యాస్, ఎరువులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. విద్యుత్ బిల్లులు ఆదా చేయడం కోసం ఆరు ఎకరాల విస్తీర్ణంలో 6 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించిన పలువురు అధికారులు