Problems in ESI Hospital: తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కిడ్నీ రోగుల చికిత్సకు వినియోగించే కిట్ల కొరత.. చిరు ఉద్యోగులకు శాపంగా మారింది. దాదాపు 9 లక్షల మంది చిరు ఉద్యోగులు, సంఘటిత కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రిలో.. సరిపడినన్ని కిట్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కిడ్నీ రోగుల రక్తాన్ని శుద్ధి చేయడానికి పెరిటోనియల్ డయాలసిస్, హిమో డయాలసిస్ విధానాలను అనుసరిస్తారు. హిమో డయాలసిస్ కోసం రోగి తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవలసి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్‌లో రోగి సంబంధిత కిట్లు, మందులు ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేసుకోవచ్చు. అయితే ఏడాదికాలంగా ఆస్పత్రిలో డయాలసిస్‌కు వినియోగించే కిట్లు, మందులు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సొంతంగా కొనుగోలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సమస్యతో కిడ్నీరోగులకు కిట్లు అందచేయలేకపోతున్నాము. స్థానికంగా కిట్లు కొనుగోలు చేసేందుకు అనుమతి కోరాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా రోగుల సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. - రాజేంద్ర, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్, ఈఎస్‌ఐ ఆసుపత్రి, తిరుపతి
గతంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నుంచి తితిదే పరిధిలోని స్విమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడం ద్వారా కిట్లు అందచేసేవారు. ఏడాదిగా స్విమ్స్ డయాలసిస్ కిట్లు అందించడం నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు సర్వదర్శన కష్టాలు.. చెట్ల కిందే పడిగాపులు