లాక్డౌన్తో విద్యా సంస్థలు మూసివేసినందున... పాఠ్యాంశాలు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి సమస్యను పరిష్కరించేందుకు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వినూత్న ఆలోచన చేసింది. ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సత్సంబంధాల కోసం ఏర్పాటుచేసుకున్న మెంటార్-మెంటీ విధానంతో ఆన్‌లైన్ విద్యాబోధన చేస్తున్నారు.
మార్చి 31 నుంచి ఆన్‌లైన్ పాఠాలు
లాక్‌డౌన్ ప్రారంభమైన వారం తర్వాత నుంచి విశ్వవిద్యాలయం ఆన్‌లైన్ బోధన ప్రారంభించింది. తరగతులు నేరుగా నిర్వహించడానికి అస్కారం లేకపోవడం వల్ల జూమ్, గూగుల్ డుయో, స్కైప్, టెక్ ఎడ్యుకేషన్ వంటి అప్లికేషన్ల ద్వారా వీడియో తరగతులు నిర్వహిస్తున్నారు. మార్చి 31 నుంచి ఆన్‌లైన్‌లో పాఠాలు ప్రారంభించారు. మహిళా విశ్వవిద్యాలయం అందిస్తున్న 55 కోర్సులు ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటి వరకూ సోషల్ సైన్సెస్ విభాగంలో 450 గంటలు, సైన్స్ విభాగంలో 300 గంటలు, ఇంజనీరింగ్ విభాగంలో 400 గంటల చొప్పున విద్యాబోధన చేసినట్లు అధ్యాపకులు తెలిపారు.
ఉదయం నుంచి రాత్రి వరకు...
ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పాఠాలు... రాత్రి 8 గంటల వరకు కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల విలువైన సమయాన్ని విద్యార్థులు కోల్పోకుండా ఆన్‌లైన్ పాఠాలు ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: