చిత్తూరు జిల్లాలో ప్రధానంగా నగరపాలక సంస్థలైన చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్ లలో వైకాపా ప్రభావం చూపించింది. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. 37 డివిజన్లు వైకాపా అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. కేవలం 13 డివిజన్లకే ఎన్నికలు జరుగనున్నాయి. మెజార్టీ స్థానాలు వైకాపా ఖాతాలోకి చేరగా.. చిత్తూరు నగర పీఠంపై వైకాపా జెండా ఎగరేయడం ఇక లాంఛనమే. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లకు 22 వైకాపాకు ఏకగ్రీవం కాగా.. 28 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. పుంగనూరు పురపాలక సంఘంలో 31వార్డులు ఉండగా అన్నీ వైకాపా అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి.
వైకాపా దౌర్జన్యాలకు నిరసిస్తూ పుంగనూరులో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా ప్రకటించింది. దీంతో పుంగనూరు వైకాపా పరమైంది. పలమనేరు పురపాలక సంఘంలో 26 వార్డుల్లో.. 18 వార్డులు వైకాపాకి ఏకగ్రీవం కాగా.. 8వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ వార్డులు ఏకగ్రీవమైనందున పలమనేరు మున్సిపాలిటీ వైకాపా ఖాతాలోకి వెళ్లటం లాంఛనమే. పుత్తూరు, నగరి పురపాలక సంస్థల్లో వైకాపా, తెదేపా పోటాపోటీగా నిలిచాయి. నగరి పురపాలక సంఘంలో 29 వార్డులకుగాను 6 వార్డులు వైకాపాకి, 1 వార్డు తెదేపాకి ఏకగ్రీవమైంది. పుత్తూరులో 1 వార్డు మాత్రమే వైకాపాకి ఏకగ్రీవంకాగా ..మిగిలిన 26 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తిరుపతి 7వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అధికారులు ప్రకటించటం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆర్వో ఎదుట జరిగిన అన్యాయంపై గళమెత్తిన అభ్యర్థి విజయలక్ష్మి, ఆమె భర్త మధు.. సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరో నామినేషన్ ను ఉపసంహరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి.. ఎన్నికల సంఘానికీ లేఖను పంపారు.
తిరుపతిలోని 26 డివిజన్, చిత్తూరు జిల్లా మదనపల్లెలోని 26వ వార్డులు రెండింటిలోనూ భాజపా అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లను తొలగించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తిరుపతిలో భాజపా అభ్యర్థులు తమపై వైకాపా నాయకులు దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరు పురపాలక సంఘం ఎదుట వైకాపా, తెదేపా నాయకులు బాహాబాహీకి దిగారు. ఉపసంహరణ గడువు ముగియకుండానే నామినేషన్ కేంద్రంలోకి వెళ్లేందుకు వైకాపా నాయకులు యత్నించగా.. తెదేపా నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వివాదం చెలరేగింది. పోలీసులు శ్రమించి ఇరువర్గాలను పురపాలక సంఘం నుంచి పంపించివేశారు.
ఇదీ చదవండి: పరిశోధనలే ప్రజారోగ్యానికి కీలకం