చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు వెల్లడించారు. 17,10,699 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. 17వతేదీ ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ ప్రొటోకాల్ కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18వ తేదీ రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని కోరారు.
బరిలో 28 మంది..
ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు ఉండగా- నోటాతో కలుపుకొని మొత్తం 29 మంది పోటీలో ఉన్నారని, ఆ మేరకు రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 10,850 మంది సిబ్బందిని పోలింగ్ విధులకు కేటాయించడంతో పాటు రెండు విడతలుగా అవసరమైన శిక్షణ ఇచ్చామన్నారు. కొవిడ్ దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి టీకా ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు 23 కంపెనీల కేంద్ర బలగాలను, 3 కంపెనీల స్పెషల్ ఫోర్స్‌ను వినియోగిస్తున్నట్లు వివరించారు. 877 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను నియమించామని తెలిపారు.
నియమావళి అమలుకు...
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేసేందుకు 280 మంది సిబ్బందితో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. నియోజకవర్గాలకు సంబంధం లేని.. పార్టీల వ్యక్తులు వెళ్లిపోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డులను ఓటర్లు పోలింగ్‌కు తీసుకురావాలని, ఓటరు స్లిప్పును గుర్తింపు కార్డుగా పరిగణించడం జరగదని స్పష్టం చేశారు.
198 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు
తిరుపతి ఉప ఎన్నికకు ఆర్టీసీ 198 బస్సులను ఏర్పాటు చేసిందని ఆర్‌ఎం పీవీ శేషయ్య తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ బస్సులు శుక్రవారం రీజియన్ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రాలకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్...
కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందన్నారు. 80 ఏళ్లు దాటిన వారు 508, దివ్యాంగులు 284, ఎన్నికల సిబ్బంది 3,195 మందికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. 497 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా పంపించారన్నారని తెలిపారు.
ప్రతి గంటకు పోలింగ్ శాతం
మే రెండో తేదీ జిల్లాకు సంబంధించిన నాలుగు నియోజకవర్గాలకు డీకేడబ్ల్యూ కళాశాల, చిత్తూరు జిల్లాకు సంబంధించి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తిరుపతిలో కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓటింగ్ రోజు ప్రతి గంటలకు పోలింగ్ శాతం వెల్లడిస్తామన్నారు. ‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ అనే యాప్‌ను ఏర్పాటు చేశారని, అందులో పోలింగ్ కేంద్రానికి దారి చూపేలా జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నగదు, మద్యం, వాహనాలు సీజ్
వ్యయ పరిశీలకుల సమక్షంలో మూడు విడతలుగా అభ్యర్థుల ఖర్చును పర్యవేక్షించారని, 41 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై 145 కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 4 కోట్ల విలువైన నగదు, మద్యం, 18 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల నుంచి వాలంటీర్ల తొలగింపు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. బీఎల్వోల ద్వారా 92 శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. పోలింగ్ సమయంలో దివ్యాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తోడ్పాటుగా రెడ్‌క్రాస్ వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటామన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ పాల్గొన్నారు.
పటిష్ఠ బందోబస్తు.. - ఎస్పీ భాస్కర్ భూషణ
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు పోలీసుశాఖ తరఫున పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని కేటాయించారు. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 149 మొబైల్ పార్టీలు, 31 ఫ్లయింగ్ స్క్వాడ్, 40 చెక్‌పోస్టులు, 26 ఎంసీసీ బృందాలు, 68 స్ట్రైకింగ్ ఫోర్స్, 99 సెక్షన్స్‌తో స్ట్రాంగ్ రూమ్ గార్డ్స్‌ను నియమించారు. ఎన్నికల విధులకు 2027 సిబ్బందిని కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 17,073 మందిని బైండోవర్ చేయడంతో పాటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సెక్షన్ 144, 30 ని అమలు చేశారు. ఈ నెల 17న జరిగే ఉప ఎన్నికలో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
డీఐజీ సమీక్ష..
ఎన్నికల బందోబస్తుపై గుంటూరు రేంజీ డీఐజీ త్రివిక్రమ వర్మ గురువారం రాత్రి పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: కిరాతకం: 20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు