తిరుపతి నగర రహదారులు నరకానికి దారులుగా మారిపోయాయి. గుంతలు పడిన రహదారులపై తిరునగరవాసులతో పాటుగా.. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు నీటి పైప్‌లైన్లు, భూగర్భ విద్యుత్ తీగలు, మురికి నీటి కాలువల నిర్మాణాల వంటి వాటి కోసం తవ్విన రహదారులను ఏళ్లు గడుస్తున్నా పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో తాగునీటి పైపులైన్లు, భూగర్భ మురికి కాలువల కోసం నగరంలో దాదాపు 240 కిలోమీటర్ల మేర రహదారులను తవ్వేశారు. భూగర్భ విద్యుత్ తీగల కోసం 145 కిలోమీటర్ల మేర రోడ్లను తవ్వారు. అభివృద్ధి పనుల పేరుతో తవ్వేసిన రహదారులకు మరమ్మతులు చేయక పోవడంతో పట్టణంలోని రోడ్లన్నీ గుంతలతో నిండిపోయాయి.
గడచిన రెండేళ్ల కాలంలో తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని రోడ్ల నిర్వహణ పడకేసింది. ఎయిర్ బైపాస్, మహతి, కపిల తీర్థం రోడ్లు, తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, రాయల్ చెరువు రహదారులతో పాటు కొర్లగుంట ప్రధాన రహదారి, లీలామహల్ - నగరపాలిక కార్యాలయం రోడ్డు పాత ప్రసూతి ఆసుపత్రి రహదారులు, బస్టాండ్ పరిసరాలు, మహిళా విశ్వ విద్యాలయం రోడ్డు, వైకుంఠపురం, బైరాగపట్టెడ ఇలా నగరంలో పలు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు దెబ్బతిన్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. గుంతలు పడిన రహదారుల్లో ప్రయాణం చేయడం నరకంగా మారిందని నగర వాసులు వాపోతున్నారు. ప్రయణాలే కాదు..వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరం వర్షపు నీటిలో తేలియాడుతున్నా..చివరికి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారే కరవవయ్యారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనుల పేరుతో రోడ్లను ఎక్కడ పడితే అక్కడ తవ్వేసిన అధికారులు వాటి మరమ్మతులను మాత్రం పట్టించుకోవడం లేదు. అంతర్గత రహదారుల గుంతలు పూడ్చని అధికారులు మాస్టర్ ప్లాన్ రోడ్లతో కోట్లాది రూపాయలు వెచ్చించి నగర శివార్లలో 60 అడుగుల వెడల్పు రోడ్లు నిర్మిస్తుండడంపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :