పర్యాటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజన్‌లో నాలుగు రకాల ప్యాకేజీలను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. స్థానికులను తితిదే పరిధిలోని ఆలయాల సందర్శనకు తీసుకెళ్లేందుకు మూడు రకాల ప్యాకేజీలు, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి మరో ప్యాకేజీ రూపొందించింది. తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, కార్వేటినగరం, నారాయణవనం ఆలయాలు ఒక ప్యాకేజీ.. తిరుచానూరు, కపిలతీర్థం, ముక్కోటి, శ్రీనివాస మంగాపురం మరో ప్యాకేజీగా ఏర్పాటు చేశారు. స్థానిక ఆలయాలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం సందర్శకులకు విడివిడిగా ప్యాకేజీ అమలు చేస్తున్నారు. స్థానిక ఆలయాల సందర్శనకు ఒక్కో ప్యాకేజీకి రూ.వంద వసూలు చేసేవారు. స్థానిక ఆలయాలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు విడివిడిగా రూ.250 చెల్లించిన వారిని తీసుకెళ్లేవారు. వీటితో పాటు తమిళనాడులోని మదురై, కుంభకోణం, కోయంబత్తూరు...కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు పట్టణాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల ద్వారా వారి దూరాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేసేవారు. మార్చి నెల నుంచి తితిదే పర్యాటక శాఖకు కేటాయించే దర్శన టికెట్ల కోటా నిలిపివేయడంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.
తిరగని బస్సులకు పన్ను రద్దు చేయాలి
రాష్ట్రంలో తిరుపతి, విశాఖ డివిజన్లకు మాత్రమే రవాణా విభాగాలు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద రవాణా విభాగం తిరుపతి డివిజన్‌ది. ఇక్కడ మొత్తం 28 వివిధ రకాల వాహనాలు ఉండగా ఎనిమిది వోల్వో, మూడు ఏసీ, పది నాన్‌ఏసీ హైటెక్‌తో పాటు చిన్నబస్సులు, ఇన్నోవా కార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు దాదాపు రూ.మూడు కోట్లకుపైగా ఆదాయం వచ్చేది. మార్చి నెల నుంచి అవన్నీ షెడ్లకే పరిమితమయ్యాయి. తిరగని బస్సులకు వాహన పన్ను రద్దు చేయాలని కోరాం. 53 మంది డ్రైవర్లు, మరో 30 మంది సిబ్బంది పని లేకుండా ఉన్నారు. - మల్లికార్జున గౌడ్, ట్రాన్స్‌పోర్టు మేనేజర్, పర్యాటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజన్
టికెట్లు పునరుద్ధరించాలని తితిదేకు లేఖ
తితిదే రోజుకు 2500 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కేటాయించేది. వాటిని విక్రయించి ఇతర రాష్ట్రాల భక్తులను తిరుమల శ్రీవారి దర్శనాలకు పంపడం ద్వారా ఆదాయం వచ్చేది. మార్చి నుంచి దర్శన టికెట్లను నిలిపివేసింది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లు దర్శనాల పునరుద్ధరణపై చరవాణిల ద్వారా ఆరా తీస్తున్నారు. పర్యాటక సంస్థకు కేటాయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పునరుద్ధరించాలని పర్యాటక కార్యదర్శి రజత్‌భార్గవ్ తితిదేకు లేఖ రాశారు.
- సురేష్‌రెడ్డి, డీవీఎం, పర్యాటక అభివృద్ధి సంస్థ, తిరుపతి డివిజన్
ఇదీ చదవండి: ఆరేళ్లలో 90 మంది అతివల బలి