సాంకేతికత అందిపుచ్చుకుంటూ..
ఇంజినీరింగ్ అనంతరం చైన్నైలోనే ఓ షిప్పింగ్ కంపెనీలో మోహన్ ఎక్సిక్యూటివ్‌గా చేరాడు. అప్పుడే తన ఆలోచనలకు పదును పెట్టాడు. మెరైన్ ఇంజినీరింగ్ అంతా యంత్రాలచుట్టూనే తిరుగుతుంది తప్ప... అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటం లేదని గ్రహించిన మోహన్ ఆ దిశగా అధ్యయనం సాగించి విజయం సాధించాడు. మెరైన్ ఇంజినీరింగ్‌కు ఐటీ సాంకేతికతను జోడించాలనే ఆలోచనతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కస్టమర్ సర్వీసెస్‌లో ఎంబీఏను పూర్తి చేశాడు. డెన్మార్క్ ప్రధాన కార్యాలయంగా ముంబైలో సేవలిందిస్తోన్న అల్ట్రాషిప్ అనే విదేశీ షిప్పింగ్ కంపెనీ మోహన్‌కు తమ బృందంలో అవకాశమివ్వటంతో అతడి జీవితం మలుపు తిరిగింది. నేవిగేషనల్ సాఫ్ట్వేర్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, మెరైన్ ఈఆర్పీ, మెరైన్ సిస్టమ్స్ సైబర్ సెక్యూరీటీలతో పాటు... నౌకల్లో అంతర్జాతీయ సదుపాయాలను ఏర్పాటు చేసేలా ఓ ప్రాజెక్ట్ రూపకల్పన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. డెన్మార్క్‌లో మెరైన్ ఐటీ హెడ్‌గా ఉన్నత ఉద్యోగం సంపాదించాడు.
నడిసంద్రం నుంచి సమాచారం అందేలా
ఆల్ట్రాషిప్ కంపెనీకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 భారీ నౌకల్లో తన ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతులు పొందాడు మోహన్. నౌక నడి సంద్రంలోకి వెళ్లాక... అందులో ఉన్న మనుషులు భూమిపై ఉన్న వాళ్లతో సమాచార ప్రసారం జరపాలన్నా... తర్వాత వచ్చే పోర్టులో నౌకకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేయాలన్నా అంతకు ముందు వీలయ్యేది కాదు. ఆయా దేశాలకు చెందిన రక్షణ వ్యవస్థల్లో మాత్రమే ఈ సాంకేతికత ఉండేది. ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలకూ వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మోహన్... తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు.
నాలుగేళ్లలో 35 దేశాల్లో
ఉపగ్రహాల సాయంతో... భారీ నౌకల్లో ప్రత్యేక ఏంటెన్నా సదుపాయాలను ఏర్పాటు చేసి... ఎంత నడి సముద్రంలో ఉన్నా శాటిలైట్‌తో అనుక్షణం అనుసంధానమై ఉండేలా రూపొందిన ప్రాజెక్ట్‌లోనూ మోహన్ కీలకపాత్ర పోషించాడు. కేవలం నాలుగేళ్లలోనే 35 దేశాల్లో మెరైన్ ఇంజనీర్‌గా సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, డెన్మార్క్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, అమెరికా ఇలా ప్రముఖ ప్రపంచదేశాల్లో పనిచేసిన అనుభవం మోహన్ సొంతం. నెలకు ఆరువేల జీతంతో ప్రారంభమైన అతడి జీవితం.. ఇప్పుడు లక్షలు సంపాదించే స్థాయికి చేరుకుంది.
ప్రైవేటు నౌకల్లోనూ అంతర్జాల సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అందులో పనిచేసే ఉద్యోగుల్లో... తమ కుటుంబ సభ్యులకు దూరంగా గడుపుతున్నామన్న బాధను తీర్చగలగడమే తనకు ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నాడు మోహన్. మెరైన్ ఇంజినీరింగ్ రంగంలోకి ప్రవేశిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటూ ప్రోత్సహిస్తున్నాడు.
ఇదీ చూడండి..