New Districts in AP : జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిరసన జ్వాలలు మరింతగా రగులుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలని, ఆయా జిల్లాల్లో తమ నియోజకవర్గాలను కలపకూడదంటూ.. తెరమీదకు కొత్త డిమాండ్లు వస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో...
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చాలంటూ.. అభ్యంతరాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పల్నాడును.. గురజాల కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ.. అఖిలపక్ష నేతలు, పల్నాడు వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పల్నాడు ప్రత్యేక జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెనుకబడిన పల్నాడును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు, ఆలమూరు మండలాల్ని.. నూతనంగా ఏర్పాటు చేయనున్న కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్‌లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ.. 15రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు.. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాకినాడకు అతి సమీపంలోని తాళ్లరేవును.. 70కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రాపురంలో కలపడం వలన ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులేనని అన్నారు. తాళ్లరేవును కాకినాడ జిల్లాలో, ఆలమూరు మండలాన్ని రాజమహేంద్రవరంలో కలపాలని డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ.. జిల్లా కేంద్ర సాధన జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు భారీ కార్ల ర్యాలీ చేపట్టారు. ఏలూరు వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించేందుకు నర్సాపురం నుంచి కార్లలో తరలివెళ్లారు. జిల్లా కేంద్రాలపై అభ్యంతరాలు తెలిపేందుకు చేపట్టిన చలో ఏలూరు కార్యక్రమాన్ని ఆంక్షలతో పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ కార్లతో భారీ ర్యాలీకి సన్నహాలు చేశామని.. కానీ పోలీసులు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు యత్నించారని మండిపడ్డారు. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అఖిలపక్ష నేతలు తేల్చిచెప్పారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లాలోని ధర్మవరాన్ని యథాతథంగా రెవెన్యూ డివిజన్‌గా కొనసాగించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్మవరానికి దశాబ్దాలుగా ఉన్న రెవెన్యూ డివిజన్ హోదా తొలగించడం దుర్మార్గమంటూ...మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఒప్పించడంలో...స్థానిక ఎమ్మెల్యే. విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే..న్యాయ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లాలో మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజూ కొనసాగుతోంది. వీరి దీక్షకు వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌తోపాటు పలువురు నేతలు మద్దతు తెలిపారు. వెనుకబడిన మార్కాపురాన్ని.. జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూర్యప్రకాష్ అన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రం కోసం రేపు తలపెట్టిన పట్టణ బంద్‌కు అంతా తరలిరావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. యర్రగొండపాలెంలో రిలే దీక్షలో నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్.. గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.
ఇదీ చదవండి