పొట్ట చేత పట్టుకుని.. బతుకు బండిని లాగేందుకు వచ్చిన వలస బతుకులకు కరోనా కష్ట కాలాన్ని తెచ్చింది. సొంతూళ్లకు వెళ్లలేక.. ఉన్న చోట తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు వలస కార్మికులు. ఉభయగోదావరి జిల్లాల్లో ఉత్తరప్రదేశ్ వలస కార్మికులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకున్నారు. పానీపూరి అమ్ముకోవడంతో పాటు నిర్మాణరంగంలోనూ 23 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రత్తిపాడు, రంపచోడవరం మండలాల్లో క్వారంటైన్ పూర్తిచేసుకున్న కార్మికులను స్వరాష్ట్రానికి పంపేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 5 రోజులుగా ఆరుబయటే తిండితిప్పలు లేకుండా రాజమహేంద్రవరంలో అవస్థలు పడుతున్నారు. తామంతా యూపీలోని ఆగ్రా, రాయబరేలీ, అమీర్‌పూర్, హస్రత్, కబీర్‌నగర్ తదితర జిల్లాలకు చెందినవారమని తెలిపారు. తాము తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయని తక్షణం స్వస్థలాలకు పంపాలని యూపీ వలస కార్మికులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!