ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహ ఉద్ధృతి పెరగడంతో గోదావరిలో వరద మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్టకు వరద పోటెత్తుతుండటంతో... మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వరద ప్రభావంతో.. తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలు ముంపులోనే ఉన్నాయి. దేవీపట్నం మండలంలో గురువారం రాత్రి నుంచి పెరుగుతూ వస్తున్న వరదతో 36 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, కూనవరం మండలాల పరిధిలోని 57 గ్రామాలదీ ఇదే పరిస్థితి.
సహాయక చర్యలు ముమ్మరం..
తూర్పుగోదావరి జిల్లాలోని 26 మండలాలు, 173 గ్రామాల్లోని లక్షా రెండు వేలకు పైగా ప్రజలను గోదావరి వరదలు ప్రభావితం చేసినట్లు అధికారులు గుర్తించారు. 27 వేల 165 గృహాలు నీటమునిగాయి. 129 పునరావాస కేంద్రాల్లో సుమారు 52 వేల మందికి వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 15 లాంచీలు, 339 మర పడవలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 56 బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. 258 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. జిల్లాలో 19 వందల హెక్టార్లలో వరి, 8వేల 922 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించారు.
జిల్లాలో వరద తీవ్రత తగ్గడానికి మరికొద్ది రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జలవనరుల శాఖ ఇతర కీలక శాఖల అధికారులతో తాజా పరిస్థితిపై సమీక్షించారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే క్రమంలో కాలువగట్లు కోతకు గురయ్యే అవకాశం ఉన్నందున యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
ఇవీ చదవండి: జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు