నెల్లూరులో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. నగరంలోకి వచ్చే రహదారులు గోతులమయంగా మారాయి. చోదకులు భయం భయంగా వాహనాలను నడపాల్సిన దుస్థితి. మోకాళ్ల లోతు గుంతల్లో ఎప్పుడు, ఎక్కడ పడిపోతామో అర్థం కావడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి రావాలన్నా... చీకట్లో తిరిగి ఇళ్లకు వెళ్లాలన్నా ప్రమాదమేనని చోదకులు వాపోతున్నారు.
నరుకూరు, అల్లీపురం నుంచి నెల్లూరు నగరంలోకి ప్రవేశించే మార్గంలో రోడ్డు పరిస్థితి మరీ దారుణం. ముత్తుకూరు నుంచి వచ్చే రోడ్డు, జొన్నవాడ నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల సిమెంట్ రోడ్లు సైతం గుంతలుగా మారాయి. రోజూ నరకం కనిపిస్తున్నా....నగరపాలక సంస్థ వీటిని పూడ్చడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరుకు చుట్టుపక్కల నుంచి రోజూ 50గ్రామాల ప్రజలు నిత్యవసర వస్తువులు, ఉపాధి పనులకు వస్తుంటారు. వీరంతా రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాల్లో తిరిగి ఇళ్లకు పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల్లోనూ ప్రయాణం చేయలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. వాహనాలు దెబ్బతింటున్నాయని చోదకులు చెబుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నగరం చుట్టుపక్కల ఉన్న రహదారులను త్వరితగతిన బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి