Sunkesula Dam in Kurnool district: కర్నూలు సమీపంలో తుంగభద్ర నదిపై సుంకేసుల జలాశయాన్ని నిర్మించారు. 1.2 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నుంచి కర్నూలు-కడప కాల్వ ప్రారంభం అవుతుంది. ఈ కాల్వ పరిధిలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కర్నూలు నగరం సహా ఎన్నో గ్రామాలకు ఇక్కడినుంచే తాగునీటిని అందిస్తున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు సరైన నిర్వహణకు నోచుకోక ప్రమాదంలో పడింది.
జలాశయానికి మొత్తం 30 గేట్లు ఉండగా వీటిలో ఒకదానిని శాశ్వతంగా మూసేశారు. మిగిలినవాటిలో 16 బాగా దెబ్బతిన్నాయి. 9 గేట్లకు రోప్‌లు తెగిపోయాయి. భారీగా వరద వస్తే 16 గేట్లను ఎత్తలేని పరిస్థితి నెలకొంది. కేవలం 13 గేట్లే పనిచేస్తున్నా వీటికీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఇటీవల వరదలకు కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన నేపథ్యంలో సుంకేశుల ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సమీప ప్రాంత గ్రామప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తుంగభద్ర నదికి ఒకేసారి ఐదు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా తట్టుకునేలా సుంకేసుల జలాశయాన్ని నిర్మించారు. ప్రస్తుతం గేట్లు పాడవటంతో భారీ వరద వస్తే ఏంచేయాలో అర్థం కాక అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. గేట్ల మరమ్మతులకు రూ.40 కోట్లు వ్యయ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా అక్కడ ఆమోదం లభించింది. అయినా పనులకు గుత్తేదారులు ముందుకురావటం లేదు. ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సందర్శించారు.
మరమ్మతులకు అనుమతులు వచ్చినా.. రిపేర్ చేయటానికి గుత్తేదారులు ముందుకురావటం లేదు. వెంటనే మరమ్మతులు చేయాలి - కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, తెలుగుదేశం నేత
ఇటీవలి వరదల వల్ల కడప జిల్లా పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయిన నేపథ్యంలో సుంకేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు కోరుతున్నారు.
ఇదీచదవండి.