ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే ఉద్యోగులకు వాహనాల రీ రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు వంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం తీసుకొచ్చిన భారత్ (బీహెచ్) సిరీస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.. మన రాష్ట్రంలో అమలు చేయడంపై సందిగ్ధత నెలకొంది. గతనెల 15 నుంచి కేంద్రం దీన్ని అమల్లోకి తెచ్చినా, పన్నుల విషయంలో అభ్యంతరాలు, సాఫ్ట్‌వేర్ సిద్ధం కాకపోవడంతో మన రాష్ట్రంలో జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ సమయంలో వాహన జీవిత పన్ను ఎంత తీసుకోవాలనేది కేంద్రం నిర్దేశించింది. రూ.10 లక్షలలోపు కార్లు, బైక్‌లకు 8%, రూ.10-20 లక్షల మధ్య విలువైన కార్లకు 10%, రూ.20 లక్షల కంటే ఎక్కువ విలువైన కార్లకు 12% పన్ను ఉంటుంది. డీజిల్ కార్లకు 2% అదనం, ఎలక్ట్రిక్ వాహనాలకు 2% తక్కువ పన్నుగా నిర్దేశించారు. ఈ పన్ను శ్లాబ్‌లు మన రాష్ట్రంలో వేరుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలకు 9%, రూ.10 లక్షలోపు విలువైన కారుకు 12%, రూ.10 లక్షలుపైన విలువున్న కారుకు 14%గా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు జీవిత పన్ను పూర్తి మినహాయింపు ఉంది. కేంద్రం పన్నులు తగ్గించడంతో రవాణాశాఖ రాబడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి కేంద్రం సాఫ్ట్‌వేర్ సిద్ధంచేసి ఇవ్వాలి. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర పరిధిలో ఉండే వాహన్ పోర్టల్ ద్వారా సేవలందిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ సొంత సాఫ్ట్‌వేర్లు అభివృద్ధి చేశాయి. వీటికి ఇప్పుడు కొత్తగా భారత్ సిరీస్‌కోసం సాఫ్ట్‌వేర్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: యువకుల విన్యాసాలు.. ప్రేక్షకుల కేరింతలు..