ఏపీ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆయా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అమరావతి ఐకాస నేత, డాక్టర్ మద్దిపాటి శైలజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కర్నూలులో లోకాయుక్త, ఏపీహెచ్ఆర్సీని ఏర్పాటు చేయడం ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధం అని పేర్కొన్నారు. పరిపాలనకు సంబంధించిన శాసన, న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు రాజధానిలో ఉండాలన్నారు. ఏపీసీఆర్డీఏ చట్ట ప్రకారం రాజధాని నగరం అమరావతి గ్రామాల పరిధిలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ఏర్పాటు చేశారన్నారు. ఆ వ్యవస్థలు సేవలు అందిస్తున్నాయన్నారు. అప్పట్లో ప్రభుత్వం 3,309 ఎకరాల్లో న్యాయనగరం ఏర్పాటుకు ప్రతిపాదించిందని చెప్పారు. ఏపీసీఆర్డీఏ చట్టాన్ని ఆమోదించే సమయంలో ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో ఉన్నారన్నారు.
ప్రతిపాదిత రాజధానిని అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న కొందరు సభ్యులు అంగీకరించారని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తీసుకురాగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన విభాగాలన్నింటిని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం సహేతుకం కాదని.. న్యాయనగరాన్ని ప్రకటించాక రాష్ట్రస్థాయి జ్యుడీషియల్, క్వాసీ జ్యుడీషియల్ వ్యవస్థలను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దూరంగా ఉన్న జిల్లాలో లోకాయుక్త , హెచ్ఆర్సీ ఏర్పాటు చేయడం.. న్యాయాన్ని ప్రజలకు చేరువచేయాలనే సిద్ధాంతానికి విరుద్ధం అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని కర్నూలులో ఏర్పాటు చర్యలను నిలువరించాలని కోరారు. రాజధాని నగర ప్రాతం అమరావతిలో లోకాయక్త, ఏపీహెర్ఆర్‌సీ ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. ఏపీసీఎస్, లోకాయుక్త ఛైర్మన్, ఏపీహెచ్ఆర్సీ చైర్మన్, ఏపీ రాష్ట్ర క్యాబినెట్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , పలువురు మంత్రులు, వైకాపా కార్యదర్శి తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Cases Booked On Anganwadi Workers: 28 మంది అంగన్వాడీ కార్యకర్తలపై కేసు నమోదు..