Loknath innovation to prevent road accidents :కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్న ఈ యువకుడి పేరు.. లోక్‌నాథ్. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ఈ కుర్రాడు.. పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఆన్‌లైన్ తరగతులకే పరిమితమయ్యాడు. దీంతో.. దొరికిన ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని... రోడ్డు ప్రమాదాల నివారణపై అనేక అధ్యయనాలు చేశాడు.
" నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకరోజు ఒక ప్రమాదాన్ని చూశాను. బస్సు వెనుక బైక్ మీద వేగంగా వెళ్తున్న యువకుడు...బస్సు ఆగగానే వేగాన్ని అదుపు చేయలేక బస్సును ఢీకొట్టాడు. ఇలాంటి కారణాలతో అనేక ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆవిష్కరణ చేశాను. " - లోక్‌నాథ్, యువ ఆవిష్కర్త
సాధారణంగా వాహనాలు వేగంగా వెళ్తున్నప్పుడు ముందు వాహనం ఒక్కసారిగా ఆగితే వెనుక వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనిని అరికట్టేందుకు... ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ రూపొందించాడు..లోక్‌నాథ్. ఈ పరికరం ముందున్న వాహన వేగాన్ని పసిగట్టి.. మన వాహనంలోని బ్రేకింగ్ సిస్టమ్‌కు కమాండ్ అందిస్తుంది. దీంతో.. ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టే లోపు బ్రేక్ వేసి వాహన వేగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా.. రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.
" సెన్సార్‌కు ఒక ప్రిసెట్ వాల్యూ అనేది ఇచ్చి బైక్‌లో ఇన్స్టాల్ చేయడం వలన ముందు వెళ్తున్న వాహనం వేగాన్ని గమనించి మన వాహనం బ్రేకింగ్ సిస్టంకు ఎలర్ట్ పంపుతుంది. దాని ద్వారా మెల్లగా బైక్ వేగాన్ని తగ్గించవచ్చు. ఇది నా మొదటి ఆవిష్కరణ." -లోక్‌నాథ్, యువ ఆవిష్కర్త
వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై కూడా లోక్‌నాథ్ మరో ఆవిష్కరణ చేశాడు. ఇలా తన ఆవిష్కరణలను కళాశాలలో ప్రదర్శనకు ఉంచాడు. అవి ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి. అంతే కాదు.. తాను చేసిన ఆవిష్కరణలకు గానూ.. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
"అనుకోకుండా ప్రయాణించాల్సిన సందర్భాల్లో ఒక్కోసారి వాతావరణ మారిపోతుంది.అలాంటప్పుడు మనల్ని ఎలర్ట్ చేయడానికి ఒక స్మార్ట్ వెదర్ టెలికాస్టర్ కనిపెట్టాను. ఇది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. మనకి వాయిస్ రూపంలో ఈ సందేశం అందిస్తుంది. దీని ద్వారా మనం ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు తెలుసుకోవచ్చు. ఇది ట్రెక్కింక్, అటవీ ప్రాంతాల్లో వెళ్లే వారికి బాగా ఉపయోగకరం." -లోక్‌నాథ్, యువ ఆవిష్కర్త.
ఈ ఆవిష్కరణలతో పాటు పారుల్ వర్సిటీ నిర్వహించిన 48 గంటల హ్యాకథాన్‌లో... లోక్‌నాత్ మూడో స్థానంలో నిలిచాడు. విట్ వర్సిటీ నిర్వహించిన హెచ్‌సీ ఎడ్యుకేట్స్ హ్యాక్‌థాన్‌లో 40 వేల విలువైన ఆన్ లైన్ కోడింగ్ వెబ్ సైట్స్ గెలుచుకున్నాడు. అలాగే, ఎల్‌పీయూ వర్సిటీ నిర్వహించిన పిక్చర్ కేప్సన్ పోటీల్లో.. 3వ స్థానంలో నిలిచాడు.
" ఈ రెండు ఆవిష్కరణలకుగానూ నాకు ఇండియన్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ పేటెంట్ పబ్లిషర్స్, భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు వచ్చాయి.నాకు చాలా ఆనందంగా ఉంది. " -లోక్‌నాథ్, యువ ఆవిష్కర్త
లోక్‌నాథ్ తండ్రి కాకినాడలో ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పని చేస్తుండగా తల్లి గృహిణి. కుమారుడు చదువుతో పాటు... ఆవిష్కరణలపై దృష్టిసారిచడం పట్ల వారెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
"మా కుమారుడి ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు రావడం చాలా ఆనందంగా ఉంది. " - సునీల్, లోక్‌నాథ్ తండ్రి
" ప్రమాదాలను నివారణ కోసం మా తమ్ముడు చాలా మంచి ఆవిష్కరణ చేశాడు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే చాలా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. " -తుషారదేవి, లోక్‌నాథ్ సోదరి
" నేను లోక్‌నాథ్ చిన్ననాటి స్నేహితుడ్ని. నా ఫ్రెండ్ చేసిన ఆవిష్కరణలు చాలా ఉపయోగకరం. ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. " -అభినవ్, లోక్‌నాథ్ స్నేహితుడు
ఆలోచనలను ఆచరణలో పెట్టి...వాటిని ఆవిష్కరణలుగా మలిచి... పేటెంట్ హక్కులు సాధించడం చిన్న విషయమేమి కాదు. విద్యార్థి దశలోనే ఈ ఘనత సాధించిన లోక్‌నాథ్‌ను అందరు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి : Chandrayan-3: ఆగస్టులో చంద్రయాన్-3.. ఇస్రో సన్నాహాలు