కాకినాడ తీరం పర్యాటకులకు నిరాశ మిగులుస్తోంది. 50 ఎకరాల్లో 46 కోట్ల రూపాయలతో ఇక్కడ బీచ్‌పార్క్ అభివృద్ధి చేశారు. సంవత్సరానికి 88 లక్షల రూపాయల చొప్పున లీజుకు ఇచ్చినా.. పర్యాటకశాఖ, లీజుదారు మధ్య విభేదాలతో మూతపడింది. అయితే వారి నుంచి కోటీ 98 లక్షల బకాయిలు, 20 లక్షల రూపాయల విద్యుత్ బిల్లులు వసూలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జి, బబ్లర్ వంతెన, లేజర్ షో, క్యాంటీన్, కాన్ఫరెన్స్ హాల్ సేవలు పర్యాటకులకు దూరమయ్యాయి.
కాకినాడ బీచ్‌లోనే నాలుగు కోట్ల రూపాయలతో పది ఎకరాల్లో హరిత రిసార్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఆహ్లాదకర ప్రాంగణాల్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. 2020 నుంచి ఈ ప్రాజెక్టు కూడా మూతపడింది. చెక్కల వంతెన శిథిలావస్థకు చేరగా.. పచ్చదనం ఎండిపోయి నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. తీరానికి ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన గుడా పార్కు సైతం పర్యాటకులను అలరించడం మానేసింది.
ఇక్కడ హెచ్‌పీటీ-32 దీపక్ శిక్షణ విమానం, టీయూ-142 యుద్ధవిమానం ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. అవి అందుబాటులోకి రాలేదు. రూ.5 కోట్ల 89 లక్షలతో యుద్ధ విమాన ప్రదర్శనశాల అభివృద్ధి ప్రతిపాదన నిధుల్లేక మధ్యలో నిలిచిపోయింది. కూర్చునేందుకు కనీసం బెంచీలు కూడా లేవని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ ఫ్రంట్, పిచ్చుక లంక గోదావరి ప్రాంతంలో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. దిండి, ఆదుర్రు పర్యాటక ప్రాంతాలు సైతం అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు.
ఇదీ చదవండి: