Teachers Protest: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పలుచోట్ల నిర్వహించిన ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. ఉపాధ్యాయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పారని ధ్వజమెత్తారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్న వారిని మహావీర్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు వాహనాలను రోడ్డు పక్కన పెట్టి నడుచుకుంటూ కలెక్టరేట్ వద్దకు వెళ్లారు.
ముఖ్యమంత్రి స్పందించకుంటే ఏప్రిల్ రెండో తేదీన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో డైమండ్ పార్క్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. C.P.S విధానం రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని యూటీఎఫ్ నాయకులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Lorry Burnt: లారీలో ఎగిసిపడ్డ మంటలు.. వాహనం దగ్ధం