గతంలో ప్రభుత్వాసుపత్రిలో చేరాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. నిష్ణాతులైన వైద్యులున్నా పూర్తిస్ధాయిలో అత్యాధునిక వైద్య యంత్రాలు, పరికరాలు, సౌకర్యాలు అందుబాటులో ఉండక పోవడమే ప్రధాన కారణమని చెబుతుండేవారు. ఈ లోటును పూడ్చాలంటూ పలుమార్లు పాలకులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. కొవిడ్ నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం స్పందించింది. ఫలితంగా కొన్ని నెలల వ్యవధిలోనే అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ శాశ్వత వైద్య వసతులుగా రోగులకు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రతి పడకకు ఆక్సిజన్
అంశం : ఆక్సిజన్ సదుపాయం
*గతంలో : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో ఆక్సిజన్ వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండేది. ఆక్సిజన్ ట్యాంకు ద్వారా అత్యవసర విభాగాల్లోని 150 పడకలకు మాత్రమే సరఫరా ఉండేది. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి(జీడీహెచ్)లో కేవలం 20 సిలిండర్లతో రోగులకు ప్రాణవాయువు అందించేవారు.
*ప్రస్తుతం: ఆక్సిజన్ వసతి ఉన్న పడకలు భారీగా పెరిగాయి. జీజీహెచ్‌లో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ వ్యవస్థను తీసుకొచ్చి 750 పడకలకు ఈ సౌకర్యాన్ని విస్తరించారు. గతంలో ఇక్కడ 6 టన్నుల సామర్థ్యం ఉండే ప్లాంటు ఉండగా, ప్రస్తుతం దాన్ని 12 టన్నులకు పెంచారు. జీడీహెచ్‌లో కొత్తగా ట్యాంకు ఏర్పాటు చేసి ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పించారు. కడప నగరంలోని ప్రభుత్వ దంత వైద్యశాలలో 150 పడకలను ఆక్సిజన్‌తో సిద్ధం చేశారు.
అత్యవసరంలో ఆదుకునేలా
పరికరాలు : వెంటిలేటర్లు
*గతంలో : జీజీహెచ్‌లో 40, జీడీహెచ్‌లో నాలుగు వెంటిలేటర్లు మాత్రమే ఉండేవి. చాలా సమయాల్లో ఇవి సరిపోయేవి కావు.
*ప్రస్తుతం: వెంటిలేటర్లకు డిమాండు ఏర్పడింది. వీటి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరే రోగి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జిల్లాకు భారీ సంఖ్యలో వెంటిలేటర్లు సరఫరా చేసింది. ప్రస్తుతం జీజీహెచ్‌లో 180, జీడీహెచ్‌లో 100 వెంటిలేటర్లు ఉన్నాయి.
శీతల సౌకర్యంతో 10 ప్రత్యేక పడకలు
అంశం : ప్రత్యేక పడకలు, శస్త్రచికిత్స థియేటర్లు
*గతంలో : జీజీహెచ్‌లో 14 శస్త్రచికిత్స థియేటర్లు, 8 ఐసీయూలు ఉన్నాయి. జీడీహెచ్‌లో ఆరు శస్త్రచికిత్స థియేటర్లు ఉన్నాయి.
*ప్రస్తుతం: జీజీహెచ్‌లో అదనంగా మరో శస్త్రచికిత్స థియేటర్ నెలకొల్పారు. కరోనా బాధితులకు సకల వసతులు, శీతల సౌకర్యంతో కూడిన 10 పడకలను అందుబాటులోకి తెచ్చారు. జీడీహెచ్‌లోని 350కు గానూ 180 పడకలను కరోనా చికిత్సకు వీలుగా తీర్చిదిద్దారు. వీటికి పలు ప్రత్యేక పరికరాలు అమర్చారు. జీడీహెచ్‌లో శస్త్రచికిత్స థియేటర్లలో ఎలాంటి మార్పు లేదు.
త్వరితగతిన పరీక్షలు
అంశం : ప్రయోగశాలలు
*గతంలో : వివిధ వ్యాధుల నిర్ధరణకు తగిన ప్రయోగశాలలు లేవు. కీలక పరీక్షలకు నమూనాలను ఇతర ప్రాంతాలకు పంపాల్సి వచ్చేది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తొలి రోజుల్లోనూ నమూనాలను తిరుపతి, ఇతర ప్రాంతాలకు పంపించి పరీక్షలు నిర్వహించేవారు. అప్పుడు ఫలితం రావడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది.
*ప్రస్తుతం: జీజీహెచ్‌లో వైరాలజీ(వీఆర్‌డీఎల్) ప్రయోగశాల ప్రారంభించడంతో కొవిడ్ పరీక్షలు త్వరితగతిన నిర్వహిస్తున్నారు. ప్లాస్మాదానం చేసేందుకు వీలుగా జీజీహెచ్‌కు ప్లాస్మాఫెరాసిస్ యంత్రాన్ని తెచ్చారు. జీజీహెచ్, జీడీహెచ్‌తోపాటుగా మరికొన్నిచోట్ల ట్రూనాట్ యంత్రాల ద్వారా కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
ఎంతో మార్పు వచ్చింది...
కొవిడ్ నేపథ్యంలో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎంతో మార్పు వచ్చింది. పలు విభాగాలకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. భారీఎత్తున పరికరాలు సమకూరాయి. తద్వారా రోగులకు ఆధునిక వైద్యసేవలు అందించగలిగాం. - కొండయ్య, ఆర్‌ఎంవో, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కడప
ఇదీ చదవండి: