కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో తాను ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని, తెదేపా నేతలు కావాలనే తనపై బురద జల్లుతున్నారని వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బినామీ పేర్లతో వంద ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించుకున్నారని తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ మీడియా ఆధారాలు చూపించారు. దీనిపై స్పందించిన వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కడపలో మాట్లాడారు.
వంద ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు ఈనెలాఖరులోపు తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.... లేదంటే తప్పు ఒప్పుకుని పుట్టా సుధాకర్ యాదవ్ క్షమాపణలు కోరాలని రఘురామిరెడ్డి సవాల్ విసిరారు. పట్టా భూములను తమ అనుచరులు కొనుగోలు చేస్తే... అవి అటవీ భూములని తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన బంధువులు వందల ఎకరాల భూములు ఆక్రమించారని మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి : తెదేపా నేతలపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదు: పుట్టా సుధాకర్