కడప జిల్లా అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 18 మంది యువకులను పోలీసులు రక్షించారు. ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ ప్రాంతంలో అణువణువూ గాలించి యువకుల ఆచూకీ గుర్తించారు. నీరసించిన యువకులకు అల్పాహారం, మంచినీరు అందించి మేమున్నామని ధైర్యం చెప్పారు.
ఇలా తప్పిపోయారు
కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో ప్రారంభమైన ఆరాధనోత్సవాలు చూసేందుకు.. కర్నూలు జిల్లాకు చెందిన 18 మంది యువకుల బృందం బయల్దేరింది. అటవీ ప్రాంతంలో దారి తెలియక తప్పిపోయిన యువకులు.. ఆందోళన చెంది 100కు డయల్ చేశారు. దీనిపై హుటాహుటిన స్పందించిన పోలీసులు అటవీ ప్రాంతమంతా గాలించి యువకులను రక్షించారు. తమ జీవితాలను కాపాడిన జిల్లా పోలీస్‌శాఖకు జీవితాంతం రుణపడి ఉంటామని యువకుల బృందం కృతజ్ఞతలు తెలిపారు. యువకులను కాపాడిన స్పెషల్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖ ఔన్నత్యాన్ని పెంపొందించారని, మున్ముందు ఇదే స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఇవీ చూడండి: