కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం తాడిగొట్ల, కొప్పర్తి ప్రాంతాల్లో ఏపీఐఐసీ 2007లో సుమారు 7 వేల ఎకరాల డీకేటీ భూములు, రైతుల పొలాలను సేకరించింది. కొప్పర్తిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవ చూపారు. ఆయన మరణానంతరం ఈ భూములు నిరుపయోగంగానే మిగిలాయి. గతంలో ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినప్పటికీ.. ఎకరా రూ.25 లక్షలు ఏపీఐఐసీ విక్రయిస్తుండడం వల్ల వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చినట్లు.. పరిశ్రమల శాఖ ప్రభుత్వ సలహాదారు రాజోలి వీరారెడ్డి తెలిపారు.
- పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి
కొప్పర్తి వద్ద ఏపీఐఐసీ సేకరించిన 7 వేల ఎకరాల్లో ప్రస్తుతానికి 3 వేల ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల రూపాయలతో పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటితో పాటే రూ.250 కోట్ల ఇండస్ట్రియల్ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
- దళారులు లేకుండా ఉత్పత్తుల కొనుగోళ్లు
ఇక్కడ ఉత్పత్తి చేసే ఉత్పత్తులు.. దళారీలు లేకుండా నేరుగా ట్రేడర్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపిస్తోందని అధికారులు తెలిపారు. అదే విధంగా 300 ఎకరాల్లో నేషనల్ ఏరో స్పేస్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడానికి వచ్చే నెలలో పారిశ్రామిక వేత్తలు కొప్పర్తిలో స్థలాన్ని పరిశీలిస్తారని పరిశ్రమలశాఖ ప్రభుత్వ సలహాదారు రాజోలి వీరారెడ్డి వెల్లడించారు. వీటితో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు.. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
- ఉపాధి కల్పనే లక్ష్యంగా
లాక్డౌన్ కారణంగా కడప జిల్లా నుంచి 2 లక్షల 80 వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కడప జిల్లాకు లక్షా 50 వేల మంది తిరిగి వచ్చారు. ఈ క్రమంలో జిల్లాలోనే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కాగా కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టడానికి పలువురు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి..: నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన ఎస్సై