మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన యాదటి సునీల్‌యాదవ్ (26) ప్రమేయం ఉందని సీబీఐ పేర్కొంది. అతని పాత్రకు పలు ఆధారాలు దర్యాప్తులో లభించాయని వివరించింది. వివేకా ఇంటివద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో సునీల్‌యాదవ్ ప్రమేయం గురించి వెల్లడిస్తోందని చెప్పింది. ఈ హత్యలో ఇతర నిందితుల ప్రమేయం, ఎలా హత్య చేశారు? ఏ ఆయుధాలు వినియోగించారనేది తేల్చాలని, ఆయుధాల్ని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. వీటిన్నింటిపై సునీల్‌యాదవ్‌ను విచారించాలని న్యాయస్థానానికి చెప్పింది. రెండు రోజుల కిందట గోవాలో అరెస్టయిన సునీల్‌యాదవ్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై సీబీఐ అధికారులు కడపకు తీసుకొచ్చారు. పులివెందులలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతనికి 14 రోజుల రిమాండు విధిస్తూ జడ్జి పవన్‌కుమార్ ఆదేశాలిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2.55 గంటలకు సునీల్‌ను తీసుకుని న్యాయస్థానానికి వెళ్లిన సీబీఐ అధికారులు సాయంత్రం 6.45కు బయటకు వచ్చారు. జ్యుడిషియల్ రిమాండు విధించటంతో అతన్ని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. సీబీఐ అధికారులు న్యాయస్థానంలో రిమాండు రిపోర్టు దాఖలుచేశారు. అతన్ని 13 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఆ రెండింటిలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
కస్టడీకిస్తే కీలక ఆధారాలు సేకరిస్తాం
‘వివేకా హత్యకు జరిగిన కుట్ర, కొన్ని నిజాలు సునీల్‌యాదవ్‌కు తెలుసు. మేము అతన్ని విచారించినప్పుడు అవేవీ చెప్పకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందున మరికొంతమంది సాక్షుల్ని విచారించాల్సి ఉంది. కొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సి ఉంది. అతన్ని కస్టడీకి ఇస్తే విచారించి కీలకాధారాలు సేకరించేందుకు వీలవుతుంది. లేకపోతే దర్యాప్తు మరింత జాప్యమై ఇబ్బంది ఏర్పడుతుంది’ అని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది.
విచారణకు పిలిస్తే పరారయ్యారు
‘సునీల్‌యాదవ్‌ను విచారించేందుకు ప్రయత్నించినా తప్పించుకు తిరిగారు. వివేకా హత్యలో అతని భాగస్వామ్యం, పాత్ర వెల్లడించే కేసు డైరీ (సీడీ) ఫైళ్లను న్యాయస్థానానికి సమర్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. హత్యలో అతడి పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు ఉండటంతో కడపలో ఈ నెల 3న కొంతమేర విచారించాం. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు’ అని సీబీఐ రిమాండు రిపోర్టులోనూ, కస్టడీ పిటిషన్‌లోనూ వివరించింది.
చంపేస్తారని భయపడి పారిపోయాం: సునీల్ యాదవ్ తల్లిదండ్రులు
వివేకానందరెడ్డి తమకు దేవుడితో సమానమని.. ఆయన హత్యతో తమకు సంబంధం లేదని సునీల్ యాదవ్ తల్లిదండ్రులు కృష్ణయ్య యాదవ్, సావిత్రి చెప్పారు. సునీల్‌యాదవ్‌ను కలిసేందుకు వారు బుధవారం సాయంత్రం పులివెందుల న్యాయస్థానం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘వివేకా హత్య జరిగినప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తున్నారు. గతంలో సిట్ అధికారులు సునీల్ కాళ్లపై కొట్టి సంసారానికి పనికిరాకుండా చేశారు. సీబీఐ అధికారులు కూడా విచారణలో కొట్టారు. ఈ కేసులో సునీల్‌ను ఇరికించాలని చూస్తున్నారు. సన్నిహితులే అతనికి ద్రోహం చేశారు. ఎవరైనా చంపేస్తారేమోనన్న భయంతోనే మేము గోవాకు పారిపోయాం. మంగళవారం రాత్రే పులివెందులలోని ఇంటికి వచ్చాం. ఇప్పటివరకు మా బాగోగులు ఎవరూ పట్టించుకోలేదు’ అని వాళ్లు వాపోయారు.
ఇదీ చూడండి:
Viveka murder case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీల్ యాదవ్ అరెస్ట్