పంక్చర్లు వేస్తూ.. ఆ తర్వాత సోడాలు అమ్ముతూ, హోటల్లో వంట చేస్తూ ఇలా తీరిక లేకుండా పనిచేస్తున్న ఈ మహిళ పేరు సుజాత. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చెంఘీజ్ ఖాన్ పేటకు చెందిన తిన్నలూరి పరమేశ్వరరావు, తిరుపతమ్మ దంపతుల మూడో కుమార్తె. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకు కష్టాలు చూసి సుజాత చలించింది. చదువు మానేసి అన్ని పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా ఉండేది. ద్విచక్ర వాహనాలకు పంక్చర్లు వేసే పనిలో ఉన్న తండ్రికి చిన్నప్పటి నుంచి సాయం చేసేది. కుటుంబ ఆదాయం పెంచటం కోసం శ్రమించేది.
తండ్రి తరువాత కుటుంబానికి అన్నీ తానై..
అయితే తండ్రి అనారోగ్యం పాలయ్యారు. దీంతో షెడ్డు వద్ద పనులను సుజాతే చేయటం మొదలుపెట్టింది. కుటుంబ బాధ్యతలు నెత్తికెత్తుకుంది. పంక్చర్ దుకాణం ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కావటంతో ఇంట్లోనే కారంపొడి మిషన్ ఏర్పాటు చేసుకుంది. సుగంధి తయారు చేసి అమ్ముతుంది. ఇంకా ఖాళీ సమయం దొరికితే మిషన్ కుడుతుంది. తోబుట్టువుల చదువులతో పాటు వివాహాలు జరిపించింది. ఆ తర్వాత తాను కూడా వివాహం చేసుకుంది. తండ్రి మరణించిన తర్వాత తల్లి బాగోగులు తనే చూసుకుంటోంది. స్వయం సహాయక సంఘంలో చేరి అక్కడ రుణం తీసుకుని ఈ చిరు వ్యాపారాల కోసం వినియోగించుకుంది. ఇటీవల రోడ్డు విస్తరణలో పంక్చర్ల షెడ్డుని తొలగించారు. మిగిలిన కొద్దిపాటి స్థలంలోనే ఆ పనులు చేస్తున్నారు. తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని సుజాత తల్లి కోరుతున్నారు.
భర్త సాయంతో జీవితంలో ముందుకు..
ఆస్తిపాస్తులు, చదువు అన్నీఉన్నా చాలామంది నిరాశతో గడుపుతుంటారు. అలా కాకుండా శ్రమనే నమ్ముకుని ధైర్యంగా ముందడుగు వేసింది సుజాత. తనకు వీలైనన్ని పనులు చేయటం ద్వారా ఆదాయం పొందుతోంది. తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది. సుజాత భర్త చిన్నపాటి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుంటారు. తాను చిన్నప్పుడు చదువుకు దూరం కావటంతో ఆ లోటు తెలియకుండా పిల్లలను చదివించుకుంటోంది. చిన్నప్పటి నుంచి కష్టనష్టాలు ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో సాగుతున్న సుజాత జీవితం, పనితీరు అందరికీ ఆదర్శమని గ్రామస్థులు చెబుతున్నారు.
ఆదర్శ మహిళగా..
కష్టాల్లో ఉన్నా ఎవరి వద్దా చేయి చాచకుండా కష్టాన్నే నమ్ముకున్నారు సుజాత. కుటుంబ బాధ్యతలు తీసుకోవటం ద్వారా తల్లిదండ్రులకు మగపిల్లలు లేని లోటు తీర్చారు. ఓ బిడ్డగా, గృహిణిగా, తల్లిగా పలువురికి ఆదర్శంగా నిలిచారు.
ఇవీ చదవండి: