Kovelamudi On Foreign Education Scholarships: విదేశీ విద్య ఉపకార వేతనాలు మంజూరు చేయాలని గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లడం దుర్మార్గపు చర్య అని తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఆయన.. త్వరలోనే భాదితులను తెదేపా అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
విదేశీ విద్య పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మక్బూల్ జాన్ మాట్లాడుతూ.. విదేశీ విద్య ఉపకార వేతనాలు మంజూరు చేస్తారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేశారన్నారు. విదేశీ విద్య ఉపకార వేతనాలు అమలు చేయాలని కోరితే.. ఇలా పోలీసుల చేత ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. దీక్ష చేస్తున్న వారి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రికి తరలించగా.. పోలీసులకు భయపడి అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విదేశీ విద్య ఉపకార వేతనాలపై సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి : భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు : సీఎం జగన్