ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తామన్న తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ వర్షాకాల సమావేశాల్లో.. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు తెదేపా మద్దతు తెలిపిందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తెదేపా సీఏఏకి మద్దతు ఇచ్చింది కానీ ఎన్ఆర్సీకి కాదని తెలిపారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఎన్ఆర్సీలో చాలా లోపాలున్నాయన్నారు. ఒక రాష్ట్రంలో విఫలమైన ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయడం సరికాదన్నారు. సమాజంలో ఒక వర్గంపై వివక్ష చూపే దేశవ్యాప్త ఎన్ఆర్సీని తెదేపా ఎట్టి పరిస్థితిల్లో ఒప్పుకోదని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ దుర్వినియోగమయ్యే ప్రమాదముందన్నారు. ఎన్ఆర్సీలో సరైన పత్రాలు చూపలేని వారికి డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తే.. 144 సెక్షన్ ఎందుకు..?
రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. 3 రాజధానుల నిర్ణయం అర్థరహితమన్న ఆయన... రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీశారు. రైతులు, మహిళలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే 144 సెక్షన్ ఎందుకు విధించారని మండిపడ్డారు. రైతులను పెయిడ్ అర్టిస్టులు అనడం దారుణమని అన్నారు. రైతులు సెల్ ఫోన్లు వాడకూడదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
తిరుపతి ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి