Kashmiri Apple Ber Plants at Guntur : గుంటూరు గ్రామీణ మండలంలోని లాల్‌పురం గ్రామానికి చెందిన పాములపాటి ఓంకార్ సురేంద్రది వ్యవసాయ కుటుంబం. మిర్చి, పత్తి, శెనగ వంటి పంటలు సాగు చేసేవారు. వ్యవసాయంలో నష్టాలతోపాటు సాగునీటి సమస్యలతో పొలాల్ని కౌలుకిచ్చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న పొలాన్ని ప్లాట్లుగా మార్చేశారు. తన ఇంటిపై మిద్దెతోటలో భాగంగా యాపిల్ బేర్ మొక్కను పెంచడంతో బాగా కాశాయి. విస్తృతంగా సాగు చేయాలని భావించి గత మార్చిలో భద్రాచలం వెళ్లి మొక్కలు కొనుగోలు చేశారు.
ప్లాట్లుగా మార్చిన పొలాన్నే సాగు..
ప్లాట్లుగా మార్చిన పొలాన్నే దున్ని కొత్తరకం రేగుమొక్కలు నాటారు. వేసవిలో సాగునీటి సమస్య ఉండడం వల్ల ట్యాంకర్లతో నీటిని తెచ్చి డ్రిప్ విధానంలో అందించారు. అలా మూడు నెలలపాటు పంటను కాపాడుకున్నారు. తర్వాత వర్షాలు కురిశాయి. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులూ వాడకుండా మొక్కల్ని పెంచారు. 9వ నెల నుంచే కాపు మొదలైంది. సాధారణంగా యాపిల్ బేర్ పండ్లు లావుగా ఉంటాయి. కానీ పరిమాణంలో కొంచెం చిన్నగా ఉండటంతో పాటు తీపిదనం ఎక్కువ. మంచి పోషకాలు ఉంటాయని సురేంద్ర చెబుతున్నారు.
రూ.4 లక్షల వరకు ఆదాయం..
పొలంలో మొక్కలు నాటే సమయంలో మాత్రమే కూలీలను వినియోగించారు. ఆ తర్వాత మొక్కల కటింగ్, సేంద్రియ ఎరువులు వేయటం, పురుగు పట్టకుండా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ తానే చూసుకున్నారు. సురేంద్ర భార్య కూడా పనుల్లో తోడుగా ఉండేది. లక్షా 50వేలు ఖర్చు కాగా.. 4 లక్షల రూపాయల మేర ఆదాయం వస్తుందని ఆయన భావిస్తున్నారు. రోజూ 20నుంచి 40 కిలోల వరకూ పండ్లు కోస్తున్నామన్నారు. మార్కెట్‌కు పంపించకుండా పొలం వద్దే వాటిని విక్రయిస్తున్నారు.
పండ్లను పక్షులు తినకుండా పొలం మధ్యలో అక్కడక్కడా కర్రలు పాతి.. వాటికి మద్యం సీసాలు కట్టారు. గాలికి కదిలి అవి చేసే శబ్దానికి పక్షులు రాకుండా చేశారు. గతంలో వద్దనుకున్న వ్యవసాయాన్ని.. కొత్త ఆలోచనలతో మొదలుపెట్టి మంచి దిగుబడి పొందుతున్నారు.
ఇదీ చదవండి..