రాబోయే ఎన్నికల్లో భూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని.. విశ్రాంత న్యాయమూర్తి, జై భీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా.. దళిత సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో జై భీమ్ సమర భేరికి కార్యాచరణ రూపొందించారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. నగరంలోని మార్కెట్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ అంబేడ్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఓటు బ్యాంకుగానే దళితులు:
గుంటూరులో ఏర్పాటు చేసిన జై భీమ్ సమర భేరిని ఉద్దేశ్యపూర్వకంగానే పోలీసులు అడ్డుకున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు దళితలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని.. అధికార పార్టీ నేతల కనుసైగల్లో వారు పనిచేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: 'అంబేద్కర్ కలలు కన్న భారతం దిశగా కాంగ్రెస్'
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు:
అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం రాజకీయాలోకి రాబోతున్నట్లు విశ్రాంత న్యాయమూర్తి తెలిపారు. త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. పేరు, విధివిధాలను తెలియజేయనున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో జరగనున్న ఉపఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. దళితుల కోసం కృషి చేసిన నాయుకులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమరభేరిని ఎక్కడ అడ్డుకున్నారో అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అంబేడ్కర్ ఆశయాలను వైకాపా తుంగలో తొక్కింది: తెదేపా