వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గ్రూప్ హౌసింగ్ విధానం అమలు చేసి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గుంటూరు డివిజన్లోని ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాలలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం, వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణంపై మంత్రి శ్రీరంగనాథ రాజు సమీక్షించారు.
సమన్వయంతో నిర్మాణాలను పూర్తిచేయండి..
రోజువారీగా కూలీ పనులకు వెళ్లే భార్యాభర్తలు సొంతంగా గృహనిర్మాణం చేసుకోవడం కష్టంతో కూడుకున్న విషయమని, వీరికి ఆప్షన్ మూడు ద్వారా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా లేఅవుట్లలో పెండింగ్లో ఉన్న విద్యుత్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతి లేఅవుట్లో శాండ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేయాలని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం ప్లాస్టిక్ పరదాలతో భూమిలో సంపులను నిర్మించాలన్నారు. లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు వీలుగా తాత్కాలికంగా అధికారులు ఉండేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన కంకర సరఫరా కోసం క్వారీ యజమానులతో సమావేశం నిర్వహించి, తక్కువ ధరకు కంకర సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: