మంగళగిరిలోని సీఎం నివాసానికి సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన పోలీసుల నిఘా వైఫల్యం, గస్తీలేమికి నిదర్శనం. కొడుకుతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వృద్ధురాలి మెడలోనుంచి గొలుసు లాక్కెళ్లడంతో కిందపడిన వృద్ధురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించటం, దుండగుల్ని పట్టుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. విజయవాడ ఏసీబీ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శివ.. తన తల్లి జయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 28న మంగళగిరి లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి బైకుపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ వస్తుండగా... వీరి బైకును ఇద్దరు దుండగులు వెంబడించారు. యర్రబాలెం దగ్గర ఆప్కో రాష్ట్ర కార్యాలయం సమీపంలోకి రాగానే జయలక్ష్మి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆ ధాటికి ఆమె కిందపడిపోవటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. శివ స్థానికుల సాయంతో తల్లిని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు. 3 రోజులు గడుస్తున్నా నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదు. సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు నమోదయ్యాయని, వారి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.
ఇవీ చదవండి: