గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష, మెంబర్ (కోఆప్టెడ్) పదవుల కోసం ఇవాళ జరగాల్సిన ఎన్నికను వారంపాటు నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. బీసీ-ఈ కుల ధ్రువపత్రం ఇచ్చేందుకు నిరాకరిస్తూ తహశీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులపై చిలువూరు-1 తెదేపా ఎంపీటీసీ సభ్యురాలు షేక్ జబీన్ వేసిన అప్పీల్‌ను వారంలో తేల్చాలని గుంటూరు కలెక్టర్‌ను ఆదేశించింది. అప్పటివరకు ఎన్నిక నిర్వహించొద్దని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ‘ఈ దేశ సామాజిక పరిస్థితుల్లో వెనకబడిన వర్గాలకు చెందిన ముస్లిం మహిళకు రాజకీయ పదవి పొందే అవకాశం రావడం అరుదు. ఆమె పోటీకి ముందుకొచ్చినప్పుడు సాంకేతిక కారణాలను చూపుతూ హక్కులకు భంగం కలిగించడం సరికాదు. పిటిషనర్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచే అవకాశం కల్పించేందుకు వారంపాటు ఎన్నిక నిలిపేస్తే ప్రజాస్వామ్యానికి కలిగే నష్టమేమీ లేదని అభిప్రాయపడుతున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇదీ జరిగింది...
దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా 9, వైకాపా 8, జనసేన 1స్థానాలు గెలుపొందాయి. అత్యధిక స్థానాలు గెలిచిన తెదేపాకు ఎంపీపీ పీఠం దక్కే అవకాశముండటంతో చిలువూరు నుంచి గెలిచిన జబీన్‌ను ఎంపీపీ అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. ఈ క్రమంలో జబీన్‌కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. మరోవైపు సెప్టెంబర్ 24న జరిగిన ఎంపీపీ ఎన్నికకు తెదేపా(TDP), జనసేన(janasena) సభ్యులు గైర్హాజరయ్యారు. కోరం(coram) లేని కారణంగా సమావేశం వాయిదా పడింది. దీంతో 25వ తేదీన మళ్లీ సమావేశం(meeting) నిర్వహించినా అదే పరిస్థితి ఏర్పడింది.
వీడని ఉత్కంఠ..
తెదేపాకు ఎంపీపీ పీఠం దక్కకుండా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(MLA alla ramakrishnareddy) అడ్డుకుంటున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ముస్లిం మైనార్టీ మహిళకు పదవి రాకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈనెల 8న ఎంపీపీ ఎన్నిక(MPP election) నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మరోసారి జబీన్ కుల ధ్రువీకరణ పత్రం కోసం దుగ్గిరాల తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. తహశీల్దార్‌పై తెదేపా నేతలు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో... జబీన్ కుల ధ్రువీకరణ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెనాలి సబ్ కలెక్టర్‌ను జిల్లా అధికారులు ఆదేశించారు. సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా జబీన్ కు కులధ్రువీకరణ పత్రం వస్తుందా..? లేదా..? అనేది తేలనుంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా...
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని ముఖ్యమంత్రి జగన్‌కు కానుకగా ఇస్తామని.. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తామని తెదేపా అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించినా.. దుగ్గిరాలలో ఆ పార్టీ నేతలు ఆయన మాటను ధిక్కరించి పోటీకి దిగుతామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోనే అధినేత మాటకు విలువ లేదా అని ప్రశ్నించారు. స్థానిక నేతలకు విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
అనుబంధ కథనాలు..